Indonesia Weird Traditions: మనిషి జీవితం ఎన్నో అనుబంధాలు, ఆప్యాయతలతో కూడికొని ఉంటుంది. తండ్రి, తల్లి, బిడ్డ, భార్య, తమ్ముడు, అన్న, చెల్లి.. ఇలా ఏదోక బంధం ప్రతీ మనిషి పెనవేసుకునే ఉంటుంది. అయితే ఒకసారి మరణించాక ఆప్యాయతలన్నీ కనుమరుగవుతాయి. స్మశానంలో అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత బాహ్య ప్రపంచంలో ఆ వ్యక్తితో పూర్తిగా బంధం తెగిపోయినట్లే. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ తెగ మాత్రం ఇప్పటివరకూ చెప్పుకున్న వాటికి పూర్తి భిన్నం. చనిపోయిన వారి శవాలను ప్రతీ ఏటా వెలికి తీసి పూజలు చేస్తుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
టొరాజా తెగ ఆచారం
ఇండోనేషియా సులవెసి టొరాజా (Toraja) తెగకు చెందిన వారు ఓ ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. దాని పేరు ‘మైనేనె’ (Ma’nene) సంప్రదాయం. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన అంత్యక్రియల సంస్కృతుల్లో ఒకటిగా పిలువబడుతోంది. ఈ సంప్రదాయం ప్రకారం టొరాజా తెగ.. మరణించిన తమ ఆత్మీయుల శవాలను సంవత్సరాల తర్వాత కూడా బయటకు తీస్తుంటారు. శవాలను శుభ్రంగా కడిగి, కొత్త బట్టలతో అలంకరిస్తారు. వాటికి ప్రత్యేక పూజలు సైతం చేస్తారు. అనంతరం తిరిగి ఎక్కడ నుంచి తీశారో మళ్లీ అక్కడే పూడ్చివేస్తారు.
అలా ఎందుకు చేస్తారంటే?
టొరాజా తెగ ప్రజలు మరణాన్ని తాత్కాలికమైనదిగా భావిస్తారు. మరణించిన వారిని పోయినవారిలా కాకుండా ప్రయాణంలో ఉన్న వ్యక్తిగా నమ్ముతుంటారు. అందుకే వారి శరీరాలను చాలా శ్రద్ధగా చూసుకుంటారు. చనిపోయిన వారితో తమ బంధాన్ని కొనసాగిస్తుంటారు. మరణాంతరం కూడా కుటుంబ సంబంధాలను కొనసాగించాలని ఇలా చేస్తారు. అంతేకాదు ఇలా శవాలను వెలికి తీసి పూజించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగితుందని టొరాజా తెగ ప్రజలు విశ్వసిస్తుంటారు.
ఈ విశ్వాసం ఎలా పుట్టింది?
టొరాజా (Toraja) ప్రజలకు ‘మైనెనె’ సంప్రదాయం వంశపారంపర్యంగా వచ్చింది. మైనెనె అనే పదానికి ‘పురాతన వ్యక్తులను శుభ్రపరచడం’ అని అర్థం. ఈ సంప్రదాయం ఎలా పుట్టిందన్న దానికి టొరాజా తెగలో ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం పోనొ బలి (Pono Baliang) అనే వ్యక్తి ఒక అడవిలో శవాన్ని కనుగొని దానిని గౌరవంగా సమాధి చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితం గొప్పగా అభివృద్ధి చెందిందని తెగ ప్రజలు చెబుతుంటారు. అలా ఈ పవిత్ర సంప్రదాయం అభివృద్ధి చెందింది.
Also Read: TPCC Mahesh Kumar Goud: కేంద్రానికే రోల్ మోడల్.. ఆ క్రెడిట్ రాహుల్ దే.. టీపీసీసీ చీఫ్
టొరాజా ప్రజల జీవనశైలి
టొరాజా తెగ సులవెసి ద్వీపంలోని టోరాజా లాండ్ (Tana Toraja) అనే ప్రాంతంలో నివసిస్తుంది. ఈ తెగ మతపరమైన విశ్వాసాలకు పుట్టిన వేళ, వివాహం, మరణం వంటి వాటికి విశేష ప్రాధాన్యత ఇస్తుంది. మరణాన్ని ఓ మహోన్నత ఘటనగా పరిగణిస్తారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దహన సంస్కారాలు ఎన్నో రోజులపాటు జరుగుతాయి.