Amaravati Relaunch: అమరావతి పనుల పునఃప్రారంభ సభకు సర్వం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రానున్నారు. గత ఐదేళ్లుగా అగిపోయిన పనులకు తిరిగి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో భారీ బహిరంగ సభను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి సభ ఏర్పాట్లపై గందరగోళం నెలకొన్నట్లు సమాచారం.
సీమ ప్రజల ఇక్కట్లు
అమరావతి పునఃప్రారంభ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. రాజధాని ప్రాంత వాసులే కాకుండా కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. సభా ప్రాంగాణాకి వెళ్లేందుకు సరైన సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.
తాగునీటి సమస్య
మరోవైపు సభకు తరలి వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహారం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించినట్లు పేర్కొంటోంది. అయితే రాయలసీమ నుంచి వచ్చిన వారికి కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవని సమాచారం. పైగా రాయలసీమ వాళ్లకు కేటాయించిన స్థలం ఇది కాదని చెప్పి సిబ్బంది వెనక్కి పంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సీమ ప్రాంత ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Amaravati Relaunch: బెంగళూరుకు జంప్.. అమరావతి సభకు జగన్ డుమ్మా.. కారణాలు ఇవేనా!
ప్రధాని పర్యటన షెడ్యూల్
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ రాజధాని (PM Modi) పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మ. 2:55 గంటలకు గన్నవరం చేరుకోనున్న ప్రధానికి రాష్ట్రమంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడ నుంచి మ. 3:15కి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సచివాలయం వద్దకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మరోమారు మోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని మోదీ వెళ్తారు. అనంతరం పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. సా. 4:55కి గన్నవరం బయలుదేరి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.