Amaravati Relaunch: ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. జగన్ (YS Jagan) హయాంలో బ్రేక్ పడిన రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీ (PM Modi) ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఆయన స్వయంగా రాజధాని అమరావతి వస్తున్నారు. ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం.. విపక్ష నేత జగన్ కు ఆహ్వానం పంపింది. ప్రభుత్వం తరపున అధికారులు స్వయంగా వెళ్లి రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రామానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో జగన్ రాకకు సంబంధించి ఓ వార్త ప్రచారమవుతోంది.
జగన్ డుమ్మా!
అమరావతి పునః ప్రారంభ సభకు మాజీ సీఎం జగన్ డుమ్మా కొట్టబోతున్నట్లు సమాచారం. ప్రధాని రాకకు ఒక రోజు ముందే ఆయన బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉండి సభకు వెళ్లకపోతే విమర్శలు తప్పవని భావించి.. జగన్ వెంటనే బెంగళూరు వెళ్లిపోయారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
రొటిన్ కు భిన్నంగా!
వాస్తవానికి వైసీపీ అధినేత జగన్.. ప్రతీ శుక్రవారం బెంగళూరు వెళ్లిపోతారు. శని, ఆదివారాలు.. యలహంక ప్యాలెస్‌లో గడిపి తిరిగి సోమవారం రాత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే ఈసారి గురువారం సాయంత్రమే బెంగళూరుకు వెళ్లిపోవడం ఆసక్తికరంగా మారింది. అమరావతిలో జరుగుతున్న హడావిడీ చూడలేకనే ఆయన వెళ్లిపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
2015లోనూ అంతే
రాజధాని అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్.. తొలి నుంచి అసంతృప్తితోనే ఉన్నట్లు ప్రచారముంది. 2015 లోనూ అమరావతి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లలేదు. అప్పుడు కూడా ప్రధాని మోదీ రాజధాని పనులకు అంకురార్పణ చేశారు. ఈసారి కూడా అదే తంతు రిపీట్ చేశారు జగన్.
Also Read: IND vs PAK: గగనతలాలు మూసివేత.. భారత్-పాక్ కు ఎంత నష్టమో తెలుసా?
మూడు రాజధానుల నినాదం
2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్.. తాను అధికారం చేపట్టిన వెంటనే అమరావతి పనులను అటకెక్కించారన్న విమర్శలు ఉన్నాయి. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అప్పట్లోనే జగన్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో 2015లో చంద్రబాబు ప్రారంభించిన రాజధాని పనులను జగన్ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగన్ కు వ్యతిరేకంగా రెండేళ్లపాటు రాజధాని రైతులు పోరాటం కూడా చేశారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. తిరిగి అమరావతిని నిర్మించేందుకు సంకల్పించింది.