IND vs PAK: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే రెండు దయాది దేశాలు తమ బలగాలను సరిహద్దుల్లో భారీగా మోహరిస్తున్నాయి. ఓ వైపు సైనిక చర్యలకు సిద్ధమవుతూనే ద్వైపాక్షిక యుద్ధాన్ని సైతం ప్రారంభించాయి. ఇందులో భాగంగా పాక్ విమానాలకు భారత గగనతలాన్ని నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో పాకిస్థాన్ విమానయాన రంగంపై భారీగా ఆర్థిక భారం పడనుంది.
చైనా మీదుగా
పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియా లోని ఇతర నగరాలు, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే భారత గగనతలం తప్పనిసరి. భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో అటుగా వెళ్లే పాక్ విమానాలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. భారత గగనతలానికి బదులుగా చైనా, థాయ్ లాండ్ గగనతలం ద్వారా ప్రయాణాలు మెుదలుపెట్టాయి.
ఖర్చుల భారం
ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (PIA).. చైనా గగనతలం మీదుగా విమాన రాకపోకలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో PIA విమానం.. కరాచీ నుంచి కౌలాలంపూర్ వెళ్లేందుకు భారత్ కు బదులుగా చైనా గగనతలం వినియోగించినట్లు సమాచారం. అయితే ఈ మార్పు వల్ల ప్రయాణ కాలం పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు తడిచి మోపేడు కానున్నాయి.
పాక్ పౌరులపై ప్రభావం
ఆంక్షలకు ముందు వరకూ పాక్ విమానాలు.. ఆగ్నేయాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు భారత గగనతలాన్ని షార్ట్ కట్ గా ఉపయోగించుకొని భారీగా లాభపడ్డాయి. ఆయా దేశాలకు దూరం తగ్గడంతో పాటు పరిమిత ఇంధనం మాత్రమే ఖర్చు కావడం పాక్ విమానాలకు, అక్కడి పౌరులకు కలిసొచ్చింది. తాజా ఆంక్షలతో కొత్త మార్గాలను ఎంచుకోవాల్సి రావడం.. అది కూడా దూరభారం పెరిగిపోవడంతో దాని ప్రభావం పాక్ పౌరులపై పడుతోంది.
విమానాలపై అదనపు భారం
మరోవైపు పాక్ సైతం ఏప్రిల్ 24 నుంచి భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత్ నుంచి పాక్ మీదుగా పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా దుబాయి వెళ్లే ఫ్లైట్స్ పాక్ కు ప్రత్యామ్నాయంగా ఇరాన్ గగనతలం గుండా ప్రయాణిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా (Air India)సంస్థలు ప్రతీరోజూ దుబాయికి సర్వీసులు నడుపుతుంటాయి. సగటున 70-90 శాతం మేర సీట్లు భర్తీ అవుతుంటాయి. పాక్ నిషేదం నేపథ్యంలో దుబాయికి వెళ్లే ప్రయాణ ఖర్చు పెరగడంతో పాటు జర్నీ టైమ్ అధికమవుతోంది.
ఎయిరిండియాకు దెబ్బ
పాక్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం ఎయిరిండియాకు ఏడాదికి దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ. 5,000 కోట్లు) అదనపు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. నిషేదం కొనసాగనున్న ప్రతీ ఏడాది ఈ అదనపు భారం భరించాల్సి ఉంటుందని సదరు రిపోర్ట్ అంచనా వేసింది. అయితే పాక్ గగనతలం మూసివేత నేపథ్యంలో ఎయిరిండియా.. భారత ప్రభుత్వాన్ని సబ్సిడీ కోరినట్లు తెలుస్తోంది.
Also Read: Gold Rate Today : మహిళలకు భారీ గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్
ఎయిర్ లైన్స్ కూ కష్టమే!
పాక్ గగనతల మూసివేతతో ఎయిరిండియాతో పాటు టాటా గ్రూప్ యాజమన్యంలో నడిచే ఎయిర్ లైన్స్ దెబ్బేనని తాజా నివేదిక పేర్కొంది. మార్గం మళ్లింపు ద్వారా ఆ ఎయిర్ లైన్స్ సంస్థకు ఏడాదికి 520 మిలియన్ డాలర్ల అదనపు ఖర్చు పడనున్నట్లు తెలిపింది. సగటున ఢిల్లీ నుంచి అజర్ బైజాన్ లోని బాకు ప్రాంతానికి వెళ్లే విమాన ప్రయాణం 38 నిమిషాల మేర పెరిగింది. మరోవైపు విమానాలకు సంబంధించిన ఇంధన స్టాప్ ల షెడ్యూల్ సైతం మారిపోయాయి.