Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాల పేరుతో భారత్ ను తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ భారత్ పై ఏకంగా 50 శాతం సుంకాలను ట్రంప్ విధించారు. ఇటీవలే అది అమల్లోకి సైతం వచ్చింది. అటు చైనా, రష్యా సైతం అమెరికా సుంకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో పర్యటించిన ప్రధాని.. రష్యా అధ్యక్షుడు పుతిన్, డ్రాగన్ ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో చాలా సంతోషంగా కనిపించారు. ముగ్గురు నేతలు ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచనల కామెంట్స్ చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సోషల్ మీడియా వేదికగా భారత్, రష్యా, చైనా కలయికపై స్పందించారు. చైనా కుట్రల వల్ల భారత్, రష్యాను కోల్పోయామని ట్రంప్ పోస్ట్ పెట్టారు. ఆ రెండు దేశాల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ట్రంప్ రాసుకొచ్చారు. అంతేకాదు మోసకారి చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయంటూ మోదీ, పుతిన్, జిన్ పింగ్ ఉన్న ఫొటోను షేర్ చేశారు. దీన్ని బట్టి దిల్లీ – మాస్కో – బీజింగ్ మధ్య బలపడుతున్న సాన్నిహిత్యాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. అలాగే అమెరికాకు వ్యతిరేకంగా భారత్ – రష్యా – చైనా ద్వైపాక్షికంగా మరింత దగ్గరవుతున్న సంకేతాలు ట్రంప్ కు బోధపడినట్లు కనిపిస్తోంది.
చైనా చెక్ పెట్టేందుకు భారత్‌కు సపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకు పోటీగా ఎదుగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా.. భారత్ కు గత కొన్నేళ్లుగా దగ్గరవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో డెమోక్రటిక్ లేదా రిపబ్లికన్ పార్టీలు ఏవి అధికారంలోకి వచ్చినా కూడా భారత్ తో వ్యూహాత్మక స్నేహబంధాన్ని అనుసరించేవి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా భారత్ – అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేశారు. 2019లో అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం.. ట్రంప్ తో మోదీకి ఉన్న వ్యక్తిగత స్నేహ బంధాన్ని సైతం బహిర్గతం చేసింది. ఆ తర్వాత జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్ లోనూ భారత్ చురుకైన భాగస్వామ్యాన్ని పోషించింది.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. వాహనదారులకు ట్రాఫిక్ సీపీ కీలక సూచనలు
ఒక్కటైనా భారత్ – చైనా – రష్యా!
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్ పట్ల అతని వైఖరిలో స్పష్టంగా మార్పులు వచ్చాయి. సుంకాల పేరుతో భారత్ ను బెదిరించడం ప్రారంభించారు. తమ ఆంక్షలకు లెక్కపెట్టక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అమెరికాకు దిగుమతయ్యే భారత వస్తువులపై ఏకంగా 50 శాతం ప్రతీకార సుంకాలను విధించాడు. దీంతో చైనా, రష్యాతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలపరుచుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. షాంఘై సదస్సుకు హాజరయ్యేందుకు ఇటీవల చైనా వెళ్లి అక్కడ రష్యా, చైనా అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇంధనం, భద్రత, పలు రంగాల్లో సహకారం గురించి ముగ్గురు నేతలు చర్చించారు.