Hyderabad: హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. చివరి రోజైన రేపు (సెప్టెంబర్ 6) ఖైరతాబాద్ సహా నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నిమజ్జనాలపై ఫోకస్
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి సంబంధించి నెల రోజుల నుండి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు ‘ప్రధాన మార్గాలు, కొన్ని కొత్త మార్గాలు గుర్తించాం. చెట్లు, విద్యుత్, వైర్లు అన్ని తనిఖీ చేసాము. సంబంధిత డిపార్ట్మెంట్ కు సూచనలు చేసాము. వినాయక విగ్రహాలు అమ్మకాల సమయంలోనూ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లాం. ఇప్పుడు నిమజ్జనాలపై ఫోకస్ పెట్టాం. మెకానిక్స్ ను అందుబాటులోకి ఉంచుతున్నాం. ట్రాన్స్ పోర్ట్ వారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. ఇతర వాహనాల మామెంట్స్ కూడా పర్యవేక్షిస్తున్నాం’ అని సీపీ తెలిపారు.
షిఫ్టుల వారీగా 3200 మంది
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నెల రోజుల నుంచే ట్రాఫిక్ పోలీసులు కష్టపడుతున్నట్లు సీపీ తెలిపారు. రెండు షిఫ్టుల వారీగా 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది గణేష్ నిమజ్జనంలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రేపు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఉంది. వాహనాలు, ప్రజలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నాం. బడా గణేష్ నిమజ్జనం చూడాలని భావించే వారు సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వస్తే బెటర్. ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనాలు చూడాలనుకునేవారికి బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, పబ్లిక్ గార్డెన్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ ఇలా చాలా పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి’ అని తెలిపారు.
సిటీ నుంచి బయటకు వెళ్లేవారు..
బాలాపూర్ గణనాథుడు.. చాంద్రాయణగుట్ట, అలియబాద్, చార్మినార్, గుల్జార్ హౌస్, ఎం.జే మార్కెట్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంటారని ట్రాఫిక్ సీపీ తెలిపారు. కాబట్టి ఆయా మార్గాల్లో వచ్చే వాహనాదారులు.. ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు ముందుకు సాగాలని సూచించారు. అటు ప్రజలు సైతం ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ సిటీ నుండి బయటకు వెళ్లాలంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వాడుకోవలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చిన్న చెరువుల వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాటు చేశారని.. వాటిని కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు.
డ్రోన్ సేవలు, హై రిచ్ కెమెరాలు
నగరంలో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. ‘అలాగే హై రిచ్ కెమెరాలు 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేసాము. రెండు కిలోమీటర్ల దూరం వరకు నిఘా ఉంటుంది. కెమెరాలు 360 డిగ్రీస్ పనిచేస్తాయి. మెయిన్ ప్రాంతాల్లో హై రిచ్ కెమెరాలు వాడతాం. ప్రమాదాలు జరిగినప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు ట్రాఫిక్ సిబ్బంది లేదా పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకుంటారు’ అని సీపీ తెలిపారు.
Also Read: CM Revanth On Teachers: టీచర్లకు సీఎం రేవంత్ సరికొత్త టాస్క్.. ఆ బాధ్యత మీదేనంటూ.. కీలక వ్యాఖ్యలు
‘డౌట్స్ ఉంటే అడగండి’
మార్గాల విషయంలో వాహనదారులు కన్ఫ్యూజన్ ఎదురైతే దగ్గరలోని ట్రాఫిక్ పోలీసులను సంప్రదించవచ్చని సీపీ అన్నారు. వారు రూట్స్ గురించి చెప్తూ అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ‘ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల బస్సులు అపుతారు. లోపలికి ఎంట్రీ ఉండదు. జోన్ వారిగా ప్రత్యేక చానల్ ఏర్పాటు చేసాము. ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తారు. గూగుల్ మ్యాప్ కి ట్రాఫిక్ అలెర్ట్ వెళ్లేలా చేస్తున్నాం. ప్రజలు వాటిని గమనించగలరు. ప్రజలు, భక్తులు.. ఎమర్జెన్సీ సమయాల్లో హెల్ప్ లైన్ నెంబర్ లు వాడుకోవాలి. ఖైరతాబాద్ నిమజ్జనం చెయ్యడానికి 36 గంటలు ప్రాసెస్ ఉంటుంది. వెల్డింగ్ కటింగ్ లాంటి పనులు చేస్తారు. చేసిన తర్వాత 6గంటల నుండి నిమజ్జనం మొదలై ఒంటి గంటలోపు నిమజ్జనం పూర్తవుతుంది’ అని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వివరించారు.