500% tariff on India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ ను 50 శాతం సుంకాల పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే ఇది సరిపోదని భావించిన అమెరికా అధ్యక్షుడు.. రష్యాతో చమురు వాణిజ్యం చేసే దేశాలకు వ్యతిరేకంగా ఒక సరికొత్త బిల్లును తీసుకురాబోతున్నారు. అమెరికా ఆదేశాలకు వ్యతిరేకంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు సన్నద్ధమవుతున్నారు.
బిల్లుపై త్వరలోనే ఓటింగ్
రష్యా ఆంక్షల బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ బిల్లు వారం రోజుల్లోగా చట్ట సభ ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. దీనిపై అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ సైతం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఓటింగ్ జరిగి బిల్లు చట్టరూపం దాలిస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాలపై 500 శాతం టారిఫ్ విధించేందుకు ట్రంప్ కు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే భారత్ పై 500 శాతం టారిఫ్ ఖాయంగా కనిపిస్తోంది.
బిల్లులో ఏముందంటే?
500 శాతం టారిఫ్ కు సంబంధించి బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటి అయినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. బిల్లు ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు లభించినట్లు చెప్పారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు అమెరికా ప్రాధాన్యత ఇస్తోందన్న గ్రాహం.. అక్కడి అమాయకుల ప్రాణాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బలిగొంటున్నారని ఆరోపించారు. కాగా, ఈ బిల్లును గ్రాహం, డెమోక్రటిక్ సెనేటర్ రిచర్ బ్లూమెంటర్ కలిసి రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి చమురుతో పాటు గ్యాస్, యురేనియం, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం నిషిద్దం. అమెరికా అదేశాలకు వ్యతిరేకంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన దేశాలపై కఠిన సుంకాలు విధిచేందుకు ఈ బిల్లు మార్గం సుగమం చేయనుంది. అయితే ఆంక్షల బిల్లులో ట్రంప్ కొన్ని సవరణలు సైతం సూచించినట్లు తెలుస్తోంది. అవి ఏంటన్న దానిపై క్లారిటీ లేదు.
Also Read: YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
భారత్‌ను హెచ్చరించిన ట్రంప్
రష్యా నుంచి చమురును భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు చాలా చౌకగా కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ నిధులనే ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా వినియోగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా భారత్ సెకండ్ ప్లేసులో ఉంది. దీంతో భారత్ ను ట్రంప్ టార్గెట్ చేశారు. రీసెంట్ గా వెనెజులా అధ్యక్షుడు ముదురో అంశంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ట్రంప్.. భారత్ పై మరిన్ని సుంకాలు విధించే అవకాశముందని హెచ్చరించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి అని వ్యాఖ్యానిస్తూనే.. భారత్ విషయంలో తాను సంతోషంగా లేనని స్పష్టం చేశారు. ఈ విషయం మోదీకి కూడా తెలుసన్నారు. రష్యాతో చమురు వ్యాపారం ఇలాగే కొనసాగిస్తే.. త్వరలో సుంకాలు మరింత పెంచవచ్చని తేల్చి చెప్పాడు.

