Machilipatnam Crime: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడలిపై మామ కత్తితో దాడి చేశాడు. దీంతో కోడలు ఆకూరి నాగ శ్వేతకు తీవ్ర గాయాలయ్యాయి. శ్వేత తలకి, చేతిపై లోతైన గాయాలు కావడంతో ఆమెను హుటాహుటీనా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు స్పష్టంచేశారు. మరోవైపు ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పరుశాపేటలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కోడలు నాగశ్వేత మెడికల్ షాపు నుంచి బయటకు వస్తుండగా అక్కడే మాటు వేసిన మామ సోమరాజు ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. నాగశ్వేతకు కొన్నేళ్ల కిందట వలందపాలెంకు చెందిన వెంకన్నతో వివాహం జరిగింది. అయితే వెంకన్నతో తలెత్తిన వివాదం కారణంగా నాగశ్వేత గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది.
కొడుకు బాధ చూడలేక..!
వెంకన్న, శ్వేతకు 2022లో వివాహం జరగ్గా.. కొద్దికాలానికే వీరి కాపురంలో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసి విడిగా జీవిస్తోంది. అయితే తన భార్యను కాపురానికి పంపించాలంటూ అత్తింటివారిపై వెంకన్న కోర్టుకు సైతం వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. భార్య కాపురానికి రావట్లేదని కొడుకు పడుతున్న బాధను దగ్గరుండి చూస్తున్న సోమరాజు.. నాగశ్వేతపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: Pranay Amrutha Case: ప్రణయ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అమృత బాబాయ్‌కు బెయిల్ మంజూరు
కానిస్టేబుల్ అడ్డుకోవడంతో..
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మెడికల్ షాపు వద్దకు వచ్చిన కోడలిపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తు ఈగల్ టీమ్ కానిస్టేబుల్ మూర్తి అక్కడే ఉండటంతో సోమరాజును అడ్డుకున్నాడు. అతడి చేతిలోని కత్తిని లాక్కున్నాడు. దీంతో నాగ శ్వేత చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సోమరాజును కానిస్టేబుల్ మూర్తి నిర్భందించి.. చిలకలపూడి పోలీసు స్టేషన్ కు తరలించాడు. జరిగిన సంఘటన తెలుసుకున్న బందరు డీఎస్పీ రాజు.. హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కోడలు శ్వేత మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

