Tirumala Liquor Bottles: తిరుమలలో మద్యం బాటిళ్ల కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. అలిపిరి టోల్ గేట్ గుండా కొండపైకి నిత్యం మద్యం సరఫరా అంటూ ఈ నెల 4న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విసృత స్థాయిలో చర్చ జరిగింది. దీనిపై టీటీడీ, పోలీసులు, విజిలెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపగా.. షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తిరుమల మద్యం బాటిళ్ల ఘటనను వైసీపీ నేత చేసిన కుట్రగా పోలీసులు తేల్చేశారు.
అసలేం జరిగిందంటే?
తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి మరికొందరితో కలిసి మద్యం బాటిళ్ల కుట్రకు తెరలేపినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలను తీసుకొచ్చి.. కౌస్తుబం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల వద్ద పడేశారని పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం.. ముందస్తు ప్లాన్ లో భాగంగా తిరుమలకు వచ్చిన ఆళ్లపాక కోటి.. మద్యం బాటిళ్లను గుర్తించినట్లు నవీన్ అనే వ్యక్తికి తెలిపాడు. అప్పుడు నవీన్ ఈ విషయాన్ని వైసీపీ అనుబంధ మీడియాగా చెప్పబడుతున్న సంస్థలో పనిచేసే మోహన్ కృష్ణ అనే వ్యక్తికి తెలియజేశాడు. అప్పుడు మోహన్ కృష్ణ తన ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్ ను పంపించి.. వారి ద్వారా మద్యం బాటిళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
పక్కా ఆధారాలతో..
నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వర్గాలు ఎక్సైజ్ శాఖ సహకారం తీసుకున్నాయి. ఖాళీ మద్యం సీసాలపై ఉన్న ఆధారాల ద్వారా వాటిని కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, వాహనాల రాకపోకలు, ఫాస్ట్ ట్యాగ్ తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా కుట్రలో భాగమైన వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఏ1గా ఆళ్లపాటి కోటి, ఏ2గా మోహన్ కృష్ణను చేర్చారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, కారు, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్ ను ల్యాబ్ కు పంపించినట్లు వెల్లడించారు. అయితే కుట్రలో పాలు పంచుకున్న మరో నిందితుడు నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్ల కేసు
ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
వైసీపీ నేతలు కోటి, నవీన్, సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు నమోదు
నిన్న కోటి, మోహన్ కృష్ణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
కోర్టు రిమాండ్కు తిరస్కరించడంతో స్టేషన్ బెయిల్ మంజూరు
తన… pic.twitter.com/zQ7hLtd5Li
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026
Also Read: Ponnam Prabhakar: రాహుల్ గాంధీని విమర్శిస్తే తాట తీస్తాం.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!
టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయాలనే..
తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ఖాళీ మద్యం బాటిళ్లను అడ్డుపెట్టుకొని టీటీడీ, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ కుట్రపై టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల పవిత్రను దెబ్బతీసేందుకు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కుట్రలో భాగంగా తిరుమలకు మద్యం సీసాలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వైసీపీ కార్యకర్తల పాపం పండిందని పేర్కొన్నారు. టీటీడీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో భూమన తన మనుషులతో నిత్యం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

