Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వ్యవహారం అనుమానాలకు తావిస్తున్నది. నిజాన్ని నిగ్గు తేల్చాలనుకుంటున్న ప్రభుత్వ సంకల్పం నీరుగార్చేలా ఉన్నది. కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారుల లింకులపై ఫోకస్ పెట్టకుండా పాత సీసాలో కొత్త సారా మాదిరి గతంలో విచారించిన వారినే మళ్లీ విచారణకు రావాలని నోటీసులు పంపుతున్నది. దీనివల్ల కేసు సైడ్ ట్రాక్‌లో పోతున్నదనే విమర్శలు పోలీశ్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
కొత్తగా మళ్లీ నోటీసులు
బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు విచారణకు రావాలని తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. దాంతోపాటు ఓ ఎమ్మెల్సీ తండ్రి, ఎమ్మెల్యే కొడుకుకు కూడా పంపించింది. ఈ నెల 16న సుప్రీం కోర్టులో(Supreme Court) ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) నేతృత్వంలోని సిట్ లీడర్లకు వరుసగా నోటీసులు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ కార్యాలయానికి పిలిపించి దాదాపు 9 గంటలపాటు అధికారులు విచారణ జరిపారు. గతంలో కూడా ఈయన్ను విచారించి వివరాలు సేకరించారు. తాజా విచారణలోనూ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను విచారణకు రావాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు.
విచారణకు రావాలని నోటీసులు
ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ ఇద్దరిని గతంలో ఒకసారి ప్రశ్నించారు. నవీన్ రావు తండ్రి కొండల్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే, వృద్ధాప్యంలో ఉన్న తాను ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నానని కొండల్ రావు సిట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సజ్జనార్‌తో చెప్పినట్టుగా తెలిసింది. తన ఇంటికి వచ్చి విచారణ జరుపుకోవచ్చని తెలిపినట్టుగా సమాచారం. సందీప్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇదే విషయాన్ని మాధవరం కృష్ణారావు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సజ్జనార్‌కు తెలియచేసినట్టుగా తెలిసింది. విదేశాల నుంచి రాగానే తన కుమారుడు విచారణకు హాజరవుతాడని చెప్పినట్టుగా సమాచారం.
Also Read: Phone Tapping Case: సుప్రీంకోర్టులో హరీశ్ రావుకు ఊరట.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
పాత సీసాలో కొత్త సారాలా విచారణ
గతంలో 600 మంది వరకు నోటీసులు పంపిన సిట్, ఒక్కొక్కరిని విచారణకు పిలిపించి వివరాలు సేకరించింది. అయితే, ఇప్పుడు మళ్లీ నోటీసులు, విచారణ అంటూ పిలిపిస్తుండడం అనేక అనుమనాలకు తావిస్తున్నది. డీసీపీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ స్థాయి అధికారికి అప్‌గ్రేడ్ అయిన సిట్ తీరు పాత సీసాలో కొత్త సారాలా నత్తనడకన జరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన వారికే మళ్లీ ఇచ్చి మమ అనిపిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు హరీశ్ రావు విషయంలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఓ ఫిర్యాదు మేరకు ఆలోచిస్తున్నారే తప్ప అన్నింటిపై ఫోకస్ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మాజీ మంత్రి, ఇద్దరు ఎంపీల పాత్రపై ఫోకస్ ఏది?
ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిందితులు ఇతరుల సమాచారాన్ని బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన వారికి చేరవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ మాజీ మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఓ కీలక నేత పాత్రపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ కోణంలో కేసుపై దృష్టి పెట్టకుండా, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు, ఓ ఎమ్మెల్సీ తండ్రికి, ఎమ్మెల్యే కుమారుడికి నోటీసులు ఇచ్చి విచారించాలనుకోవడం సుప్రీంకోర్టులో సమయం దగ్గర పడుతుండడం వల్లే అనే అనుమానం కలుగుతున్నది. మాజీ మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యుల ఆదేశాలతో శ్రవణ్ రావు ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అనుచరులైన వివిధ కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశాడు. ఆ సమాచారాన్ని క్షణాల్లో నిందితులైన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావుకు చేరవేసి భారీగా డబ్బులు దండుకోవడంతోపాటు కీలకమైన సమాచారాన్ని రాబట్టాడు.
గతంలో ఇచ్చిన వారికి మళ్లీ
తర్వాత అదంతా ప్రైవేట్ వ్యక్తులకు చేరింది. దీనిపై విచారణ జరగాల్సింది పోయి, గతంలో నోటీసులు ఇచ్చిన వారికి మళ్లీ మళ్లీ ఇవ్వడం వెనుక అధికారుల అత్యుత్సాహం కనిపిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వం అనుకున్న ఉద్దేశానికి వ్యతిరేకంగా సిట్ రూట్ మారినట్టుగా అనిపిస్తున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎంతసేపు బీఆర్ఎస్‌లో ఉన్న వారిపైనే ఫోకస్ చేయడం కాకుండా కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారిని కూడా విచారించి మరింత సమాచారం రాబట్టి బలమైన ఆధారాలు సేకరించే అవకాశం ఉన్నా సిట్ ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని అనుకుంటున్నారు. గతంలో శ్రవణ్ రావు, ఇంకా ఇతరులకు సంబంధించిన ఫోటోలు, ఇతర ఆధారాలు సేకరించినా వాటిని బయటపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ సోదరుడికి సిట్ నోటీసులు

