Ponnam Prabhakar: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగించిన భాషపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా దూషించడం కేటీఆర్ అసహనానికి పరాకాష్ట అని, రాజకీయాల్లో ఓటమి భయంతోనే ఆయన నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ‘తాట తీస్తాం’ అని ఘాటుగా హెచ్చరించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగాల కుటుంబమని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు.
Also Read: Ponnam Prabhakar: రోడ్డు సేఫ్టీ మన జీవితంలో అంతర్భాగం కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
దేశ ఐక్యత, స్వేచ్ఛ కోసం ఆ కుటుంబం చేసిన పోరాటాలను విమర్శించడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయం వల్లేనని, ఆ విషయాన్ని కేటీఆర్ మర్చిపోకూడదని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ ఫ్రస్ట్రేషన్‌లో వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. దేశ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Ponnam Prabhakar: ఈవీ పాలసీని కంపెనీలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్!

