Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ రావొద్దని జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకొచ్చిందని, ఇప్పటి వరకు 1,59,304 వాహనాలకు 806.35 కోట్లు ఈవీ వాహనాలపై రాయితీ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.806 కోట్ల టాక్స్ నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడిందన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారుల కంపెనీలు, డీలర్లతో మంత్రి పొన్నం శుక్రవారం సమావేశం అయ్యారు. ప్రభుత్వ విజన్ 2047 నాటికి జీరో ఉద్గారాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా ఉంటుందన్నారు.
20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు
హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల పెరుగుతున్న కొత్త కాలనీల దృశ్య జీవో 263 తీసుకొచ్చిందని, అందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు,10 వేల సీఎన్జీ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, 25 వేల రెట్రో ఫీటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరిపడ ఛార్జింగ్ స్టేషన్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని కంపెనీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం జరుగుతుందని, దానిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కంపెనీలు, డీలర్లు ఏజెన్సీలు జనవరిలో జరిగే రోడ్ సేఫ్ మంత్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. రోడ్ సేఫ్టీ గురించి శనివారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తు్న్నామన్నారు. షో రూమ్‌ల వద్ద, పెట్రోల్ బంకుల వద్ద ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్‌ల సంఖ్యను పెంచాలన్నారు.
Also Read: Ponnam Prabhakar: కాంగ్రెస్‌లోకి ఇండిపెండెంట్ సర్పంచ్‌లు.. మంత్రి పొన్నం ప్రశంసల జల్లు
కొత్తగా 326 కొత్త రూట్లు
నగరంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. ఇప్పటికే 700 బస్సులు నడుస్తున్నాయని, ఈ మధ్యనే కొత్తగా 326 కొత్త రూట్లు ఆర్టీసీ బస్సులు నడుపుతుందన్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రాసెస్ నడుస్తుందని, రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తివేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రమాదాలను తగ్గించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతం చేశామని, పర్యావరణాన్ని కాపాడడానికి ఈవీ వెహికల్స్ వాడుతున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాహనాలు 20 శాతం ఈవీ వాహనాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నదన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జెటిసి రమేష్, కంపెనీల ప్రతినిధులు గోపాల కృష్ణ, సురేష్ రెడ్డి, గౌతంరెడ్డి పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్!

