North Korea – Kim: నియంత కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తర కొరియాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్ దురాగతాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. దేశంలో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మరింత విస్తరించిన కిమ్.. విదేశీ సినిమాలను షేర్ చేసిన వారికి బహిరంగ మరణ శిక్ష విధించినట్లు నివేదిక పేర్కొంది.
314 మంది సాక్షులతో నివేదిక
శుక్రవారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదిక.. ఉత్తర కొరియాలో నెలకొన్న భయంకర పరిస్థితులను కళ్లకు కట్టింది. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశ జనాభా కూడా అంతటి ఆంక్షల కింద జీవించడం లేదని పేర్కొంది. 2014 తర్వాత దేశం విడిచిపెట్టిన 314 మంది ఉ.కొ బాధితులు, సాక్షులతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా 16 పేజీల నివేదికను ఐరాస రూపొందించింది. ఈ రిపోర్ట్.. ఉత్తర కొరియాలో మానవహక్కుల పరిస్థితిని పరిశీలించి.. అత్యంత ఆందోళనకరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సుమారు 2.6 కోట్ల జనాభా గల ఈ దేశం.. కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలో పూర్తిగా బయటి ప్రపంచంతో తెగదెంపులు చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.
మరణశిక్షల్లో కొత్త పురోగతి
ఒకప్పుడు కిమ్ మాటలకు ఎదురు చెప్పిన, నిబంధనలు అతిక్రమించిన వారికి మాత్రమే మరణశిక్ష విధించేవారు. ఇప్పుడు అది కొత్త పుంతలు తొక్కిందని ఐరాస నివేదిక తెలిపింది. ఉ.కొ మరణశిక్షను చట్టపరంగా మరింత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రజలపై నిఘా మరింత విస్తృతమైందని.. ఉత్తర కొరియాలో అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయని ఐరాస రిపోర్ట్ తెలిపింది. స్వతంత్ర పౌర సమాజ సంస్థలు దేశంలో అస్సలు లేవని స్పష్టం చేసింది.
విదేశీ సమాచారంపై కఠిన చర్యలు
సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఉత్తర కొరియా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని యూఎన్ రిపోర్ట్ పేర్కొంది. దక్షిణ కొరియా డ్రామాలు, విదేశీ సినిమాలను పంచుకోవడంపై మరణశిక్షలు సహా కఠిన ఆంక్షలు అమలవుతున్నట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ కంటెంట్ పై 2018లో తొలిసారి కిమ్ ఆంక్షలు విధించారు. అది 2020 తర్వాత మరింత కఠినతరమైనట్లు ఐరాస తెలిపింది. అంతేకాదు ప్రజల్లో భయాన్ని నింపేందుకు ప్రభుత్వం బహిరంగ న్యాయ విచారణలు, మరణదండనలు నిర్వహిస్తోందని నివేదిక పేర్కొంది.
Also Read: Supreme Court: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ
ఇళ్లు, ఎలక్ట్రిక్ పరికరాల తనిఖీలు
కిమ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రత్యేక బృంధాలు.. ఎప్పటికప్పుడు ప్రజల ఇళ్లను తనిఖీలు చేస్తున్నట్లు యూఎన్ రిపోర్ట్ తెలిపింది. కంప్యూటర్లు, రేడియోలు, టీవీలు ఇలా ఇంట్లోని ప్రతి ఎలక్ట్రిక్ వస్తువును క్షణ్ణంగా ఆ బృందం పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఏ విధమైన ముందస్తు అనుమతి లేదా వారెంట్ లేకుండా ఈ శోధనలు జరుగుతున్నట్లు చెప్పింది. దీనిని సామ్యవాద వ్యతిరేక ప్రవర్తనను అరికట్టడం, జాతీయ భద్రతను కాపాడడం కోసం తీసుకుంటున్న చర్యలుగా కిమ్ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఐరాస నివేదిక వివరించింది.