Trump Tariffs Impact: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:31 గంటలకు (IST) (అమెరికా సమయం 12:01 AM) ఇది అమల్లోకి వచ్చాయి. ఫలితంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల్లో 2/3 వంతు.. 50 శాతం సుంకాల పరిధిలోకి వచ్చాయి. ఇంతకుముందు ఉన్న 25 శాతం టారిఫ్ కు అదనంగా మరో 25 శాతం విధించడంతో ఇది భారత ఎగుమతులతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపనున్నది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ ప్రతీకార సుంకాలు ఎందుకు విధించాడు? రంగాల వారీగా ప్రభావమెంత? ఈ కథనంలో పరిశీలిద్దాం.
ప్రతీకార పన్నులు ఎందుకంటే?
ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న రష్యాపై అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని లెక్కచేయకుండా రష్యా నుంచి చమురు, రక్షణ సామాగ్రిని భారత్ కొనుగోలు చేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్యా వాణిజ్యం కొనసాగిస్తూ భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీకార సుంకాల జాబితాలో భారత్ ను చేర్చాడు. 50 శాతం సుంకాలు విధించాడు.
ప్రభావం ఎంత?
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) అంచనా ప్రకారం.. అమెరికాకు ఏటా సుమారు 86.5 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను భారత్ ఎగుమతి చేస్తుంది. అందులో దాదాపు $60.2 బిలియన్ ఎగుమతులు.. ఈ 50% టారిఫ్ కిందకి వచ్చాయి. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 50 శాతం సుంకాల ప్రభావం 48.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ఉండనుంది. ఈ సుంకాలను తట్టుకొని అమెరికాకు స్వదేశీ వస్తువులను ఎగుమతి చేయడం.. లాభదాయకం కాకపోవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఫలితంగా దేశంలో ఉద్యోగాలు కోత, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలు తలెత్తవచ్చని పేర్కొన్నారు.
అత్యధికంగా దెబ్బతినే రంగాలు
వస్త్రాలు, దుస్తులు (Textiles)
అమెరికా భారత టెక్స్ టైల్ కు అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వస్త్రాల్లో 35% వాటా అమెరికాకే వెళ్తున్నాయి. ఏడాదికి 10.8 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. కొత్తగా టారిఫ్ విధించడంతో బంగ్లాదేశ్, వియత్నాం, మెక్సికో లాంటి దేశాలు భారత్ తో పోటీకి వచ్చే అవకాశముంది. దీని వల్ల దేశంలో టెక్స్ టైల్ కు కేంద్రంగా ఉన్న తిరుప్పూర్, నోయిడా–గుర్గావ్, బెంగళూరు, లుధియానా, జైపూర్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది.
రత్నాలు, ఆభరణాలు (Gems and Jewellery)
అమెరికాకు ఏటా 10 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాలు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పటి వరకూ 2.1 శాతంగా ఉన్న సుంకం 52.1%కి పెరిగింది. దీంతో సూరత్, ముంబై, జైపూర్ లో ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అమెరికా కొనుగోలుదారులు.. ఇజ్రాయెల్, బెల్జియం, చైనా, మెక్సికో వైపు మళ్లే అవకాశముంది.
రొయ్యలు (Shrimps)
అమెరికాకు భారత్ ఏటా 2.4 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతమున్న 10 శాతం సుంకానికి అదనంగా 50 శాతం తోడవడంతో పన్ను 60 శాతానికి చేరింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల రైతులు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రాసెసింగ్ కేంద్రాలు భారీ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు అమెరికన్ మార్కెట్ లో తమ రొయ్యలను విక్రయించేందుకు ఈక్వడార్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు పోటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
కార్పెట్లు (Carpets)
ఏటా జరిగే 1.2 బిలియన్ డాలర్ల కార్పెట్ ఎగుమతులపై 52.9% సుంకం వచ్చి పడింది. దీనివల్ల భదోహి, మిర్జాపూర్, శ్రీనగర్ ప్రాంతాల్లోని వ్యాపారులకు నష్టం వాటిల్లవచ్చు. ఇది టర్కీ, పాకిస్థాన్, నేపాల్, చైనా దేశాలకు అవకాశంగా మారవచ్చు.
హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నిచర్ (Handicrafts And Furniture)
చేతి వృత్తుల వస్తువులు (1.6 బిలియన్ డాలర్లు), ఫర్నిచర్ (1.1 బిలియన్ డాలర్లు) ఏటా అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఈ రంగాలపై 50 శాతం పన్ను విధించడం వల్ల భారత్ లోని జోద్ పూర్, జైపూర్, మెురాదాబాద్, సహారన్పూర్ ప్రాంతాలు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది.
లెదర్ & ఫుట్ వేర్ (Leather and Footwear)
లెదర్, ఫుట్ వేర్ కు సంబంధించి అమెరికాతో ఏటా 1.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. 50% సుంకాలు విధించడం వల్ల భారత్ లోని ఆగ్రా, కాన్పూర్, తమిళనాడులోని అంబూర్–రానిపేట్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ (Agriculture and Processed Food)
బాస్మతి బియ్యం, టీ, మసాలాలు, ఇతర ఉత్పత్తులు కలిపి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. పెరిగిన సుంకాల నేపథ్యంలో పాకిస్థాన్, థాయ్‌లాండ్, వియత్నాం, కెన్యా, శ్రీలంక దేశాలు భారత్ కు పోటీగా వచ్చే అవకాశముంది.
Also Read: Make in India: ట్రంప్ 50% టారిఫ్స్‌పై మోదీ మాస్టర్ ప్లాన్.. తెరపైకి మేక్ ఇన్ ఇండియా.. ఇక తగ్గేదేలే!
సుంకాల పరిధిలోకి రాని రంగాలు
దాదాపు 30.2% భారత ఎగుమతులు (27.6 బిలియన్ డాలర్లు) అమెరికా మార్కెట్లో ఇకపైనా టారిఫ్ లేకుండా కొనసాగనున్నాయి. ఔషధాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, చిప్ లు, స్టోరేజ్ పరికరాలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, పుస్తకాలు, ప్లాస్టిక్, లోహాలు (ఫెరోమ్యాంగనీస్, క్రోమియం, నికెల్, జింక్ మొదలైనవి), సహజ రబ్బరు, బంగారు నాణేలు, సముద్రపు జీవావశేషాలకు ఎలాంటి పన్ను వర్తించదు. మెుత్తంగా ట్రంప్ ఇచ్చిన టారిఫ్ షాక్ వల్ల భారత్ అమెరికా ఎగుమతుల్లో 40% మేర నష్టం వాటిల్లవచ్చని అంచనా.