Massive Flash Floods: జమ్ముకశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కత్రా వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు రెస్క్యూ బృందం తెలిపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.
వివరాల్లోకి వెళ్తే..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు భక్తులు వాటి కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఎస్ఎస్పీ బృందం.. కొండచరియల కింద చిక్కుకున్న వారిని ఒక్కొక్కరిగా బయటకు తీసుకు వస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రియాసీ ఎస్ఎస్‌పీ పరమ్ వీర్ సింగ్ వెల్లడించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
3,500 మంది తరలింపు
ఇదిలా ఉంటే గత నాలుగు రోజులుగా జమ్ముకశ్మీర్ లో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా రావి, చినాబ్, జీలం నదులు.. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదుల పరివాహక ప్రాంతాల్లో జీవించే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగి.. వరద ముప్పు ఎదుర్కొంటున్న 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
రికార్డ్ స్థాయిలో వర్షపాతం
జమ్ము కశ్మీర్ లోని ఉదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో మంగళవారం రికార్డు స్థాయిలో 54 సెం.మీ వర్షం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయి వర్షం కురిసిందని పేర్కొంది. సాధారణంగా దిల్లీలో వర్షాకాలం (జూన్ – సెప్టెంబర్) మెుత్తం కలిపితే 64 సెం.మీ కురవొచ్చని ఐఎండీ అంచనా వేయగా.. ఒక్క ఉదంపూర్ లో అది కూడా 12 గంటల వ్యవధిలోనే 54 సెం.మీ నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జమ్ముకశ్మీర్ లో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్లపైకి వరదలు పోటెత్తడం, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు సైతం ప్రకటించారు. చక్కీ నది వరద కారణంగా పట్టాలు దెబ్బతినడంతో.. 18 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మరోవైపు చాలా చోట్ల టెలికాం సేవలు సైతం నిలిచిపోయాయి.
Also Read: CM Revanth Reddy: చవితి రోజున ఎడతేరిపి లేని వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
భారీగా ఆస్తి నష్టం
కిష్త్వార్ జిల్లాలోని మార్గి అనే దూరప్రాంతంలో ఆకస్మిక వరద కారణంగా.. 10 ఇళ్లు.. ఒక వంతెన కొట్టుకుపోయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కథువా జిల్లా లఖన్‌పూర్ గ్రామంలో 12 మందికి పైగా వరదల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు, ఇళ్లు, వంతెనలు, వాణిజ్య సముుదాయాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
