CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు.
‘రాకపోకలను నిషేధించండి’
నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Also Read: Vinayaka Chavithi 2025: ఇవాళ ఒక్క రోజు వర్షాన్ని ఆపు గణపయ్యా.. అంటూ వేడుకుంటున్న భక్తులు
మండపం ఏర్పాట్లలో ఇబ్బందులు
వినాయక చవితి రోజున పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటం.. మండపం ఏర్పాట్లకు పెను సవాలుగా మారింది. వినాయకుడి ప్రతిమల స్థాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించడంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో నీరు నిలిచిపోవడం, రవాణా సమస్యలు, పందిళ్ల నిర్మాణంలో ఆటంకాలతో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఒక్కరోజైన వర్షాన్ని ఆపవయ్యా అంటూ గణపతిని పలువురు భక్తులు వేడుకుంటుడటం విశేషం.