Crime Influence: మైనారిటీ కూడా తీరని పిల్లలు కొందరు కరడుగట్టిన నేరస్తులకు సైతం వణుకు పుట్టేలా చేస్తున్నారు. క్రూరంగా హత్యలు చేయటం.. అఘాయిత్యాలకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. పిల్లలు ఇలా తయారు కావటానికి ఓటీటీలు.. క్రైం సీరియళ్లు(Crime serials) ఒక్కటే కారణం కాదని మానసిక వైద్యులు చెబుతున్నారు. మైక్రో ఫ్యామిలీలు(Micro families).. కుటుంబాల్లోని పరిస్థితులు..పేదరికం.. తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం ఇవ్వక పోతుండటం వల్లనే కొందరు పిల్లలు ఇలా హింసోన్మాదులుగా మారుతున్నారని విశ్లేషిస్తున్నారు.
సంపాదన అంతంత మాత్రం
రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల్లో కలవరం సృష్టించిన పన్నెండేళ్ల బాలిక సహస్ర(Sahasra) హత్యోదంతాన్ని విశ్లేషిస్తే ఇది సత్యమన్న విషయం స్పష్టమవుతుంది. గొంతు, కడుపులో ఇరవైసార్లకు పైగా పొడిచి పొడిచి చంపిన బాలుడు 10వ తరగతి విద్యార్థి. తల్లిదండ్రులు, తోడబుట్టిన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటున్నాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే బాలుని తండ్రి మద్యానికి పూర్తిగా బానిసగా మారటం. తల్లి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండటం. ఆమె సంపాదన అంతంత మాత్రంగానే ఉండటంతో నిత్యం ఆర్థిక సమస్యలు. పిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని నిస్సహాయ స్థితి. ఇక, పిల్లలు ఏం చేస్తున్నారన్నది పట్టించుకునే వారే లేరు. దాంతో ఆ బాలుడు తన ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి అలవాటు పడ్డాడు. తరచూ స్కూల్ కు డుమ్మాలు కొట్టటం మొదలు పెట్టాడు. రెండు నెలల క్రితం పదివేల రూపాయల మొబైల్ ఫోన్ ను తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా తల్లిదండ్రులు ఫోన్ కొనటానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడగలేదు. ఇక, ఓటీటీలు(OTT). క్రైం సిరీస్ లు చూడటానికి అలవాటు పడ్డ ఆ బాలుడు పద్నాలుగేళ్ల వయసులోనే డాన్ గా మారాలని నిర్ణయించుకున్నాడు.
తాగుబోతుగా మారిన తండ్రి
దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు. క్రికెట్ బ్యాట్ ను తస్కరించటానికి వెళ్లి సహస్రను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసును విశ్లేషిస్తూ గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)లో సైకియాట్రిస్టుగా పని చేస్తున్న డాక్టర్ అజయ్ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? అన్నది తల్లిదండ్రులు పట్టించుకోక పోవటమే అతను అలా మారటానికి ప్రధాన కారణమని విశ్లేషించారు. తోటి పిల్లలు మంచి దుస్తులు ధరించటం..కావాలన్నది కొనుక్కోవటం వంటివి చూసి వీళ్లు కూడా అలాగే ఉండాలనుకుంటారని చెప్పారు. కుటుంబంలోని పరిస్థితులు అనుకూలించక పోవటంతో ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటారన్నారు. తాగుబోతుగా మారిన తండ్రి ..పొద్దంతా పనికి వెళ్లే తల్లి తన గురించి ఏమాత్రం పట్టించుకోక పోవటం వల్లనే బాలుడు ఓటీటీలు.. క్రైం సిరీస్ లు చూసి డాన్ గా ఎదగాలని భావించాడని చెప్పారు. మొబైల్ ఫోన్(Mobile Phone) తెచ్చినపుడే డబ్బు ఎక్కడిదని నిలదీసి ఉన్నా. .స్కూల్ కు ఎందుకు డుమ్మాలు కొడుతున్నావని ప్రశ్నించి గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా.. గంటల తరబడి మొబైల్ ఫోన్ ను చూడటం ఆపినా ఆ పిల్లోడు అలా తయారై ఉండేవాడు కాదన్నారు.
Also Read: HC on KCR’s Petition: కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురు.. విచారణ వాయిదా?
కూతురిపై తీవ్ర ప్రభావం
జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన ప్రియుడు, అతని తమ్మునితో కలిసి తల్లి అంజలిని కిరాతకంగా హత్య చేసిన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కేసులో హతురాలి మొదటి భర్త కొన్నాళ్ల కాపురం తర్వాత ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటికే అంజలి ఓ బిడ్డకు తల్లి అని చెప్పారన్నారు. భర్త వెళ్లిపోయిన తరువాత అంజలి మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్నారు. అతని ద్వారా ఓ కూతురికి జన్మనిచ్చిందని తెలిపారు. రెండో భర్త కూడా చనిపోవటంతో మరో వ్యక్తితో సహ జీవనాన్ని మొదలు పెట్టిందని చెప్పారు. ఈ పరిణామాలన్నీ ఆమె పెద్ద కూతురిపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. తన కళ్ల ముందరే తల్లి రెండో పెళ్లి చేసువటం.. ఆ తరువాత మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండటం.. రెండో భర్తకు పుట్టిన కూతురికే ఎక్కువగా ప్రేమ పంచుతోందని భావించిన బాలిక అంజలిపై కక్ష పెంచుకుందన్నారు. సాధారణంగా ఈ వయసు పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఆదరణ కోరుకుంటారన్నారు. అవి ఇంట్లో దొరకకపోతే బయటి వ్యక్తుల్లో వెతుక్కుంటారని చెప్పారు. ఈ క్రమంలోనే 10వ తరగతిలోనే ప్రేమలో పడిందన్నారు. దీనికి అడ్డు వస్తోందన్న కోపంతోనే కన్నతల్లిని ప్రియుడు, అతని తమ్మునితో కలిసి హత్య చేసిందన్నారు.
మైక్రో ఫ్యామిలీలు
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై మైక్రో కుటుంబాలు పెరిగి పోతుండటం కూడా పిల్లలపై ప్రభావాన్ని కనబరుస్తున్నట్టు డాక్టర్ అజయ్(Doctor Ajay) చెప్పారు. గతంలలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని.. ఏ సమస్య వచ్చినా అంతా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకునే వారన్నారు. చిన్నవాళ్లు పెద్దల మాటకు గౌరవం వచ్చేవారని చెప్పారు. పండుగలు.. శుభకార్యాలు అంతా కలిసి జరుపుకునేవారని, అదే సమయంలో ఏదైనా విషాదం జరిగితే ఒకరికొకరు తోడుగా నిలబడేవారని తెలిపారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు బంధాలు.. అనుబంధాల ప్రాధాన్యత చిన్నప్పటి నుంచే ఆటోమేటిక్ గా తెలిసిపోయేదని వివరించారు.
Aiso Read: Advait Kumar Singh: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై కేసు నమోదు..?
కుటుంబాల నుంచి విడిపోయి
ప్రస్తుతం దీపం పట్టుకుని వెతికినా ఉమ్మడి కుటుంబాలు కనిపించటం లేదని డాక్టర్ అజయ్ చెప్పారు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మేమిద్దరం…మాకిద్దరు అంటూ చాలామంది కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నారని చెప్పారు. ఇక, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని…వీళ్లు తమ తమ పిల్లలకు రోజులో కనీసం రెండు గంటల సమయం కూడా కేటాయించటం లేదన్నారు. దాంతో పిల్లలు టీవీ షోలు.. సినిమాలు.. మొబైల్ ఫోన్లలో పోర్న్ సైట్లు చూస్తూ పెరుగుతున్నారన్నారు. తమ గురించి పట్టించుకునే వాళ్లు లేకపోతుండటంతో మొండిగా తయారవుతున్నారని వివరించారు. కోరుకున్నది ఎలాగైనా సరే సాధించుకోవాలని అనుకుంటున్నారన్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని…బైక్ ఇప్పించ లేదని మైనారిటీ తీరని యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకోవటం దీనిని స్పష్టం చేస్తోందన్నారు.
కొంతలో కొంతైనా అడ్డు కట్ట
కొంతమంది తల్లిదండ్రుల నుంచి దొరకని ప్రేమను ఇతరుల్లో వెతుక్కుంటున్నారని..దానిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించినపుడే ఇలాంటి దారుణాలకు కొంతలో కొంతైనా అడ్డు కట్ట వేయవచ్చని డాక్టర్ అజయ్ అభిప్రాయ పడ్డారు. ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా రోజులో కనీసం రెండు గంటలు పిల్లల కోసం కేటాయించాలన్నారు. వారితో ప్రేమగా మాట్లాడాలని.. సమస్యలు ఏవైనా ఉంటే తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. మంచి ఏది.. చెడు ఏది వివరంగా తెలియచేయలన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నా పండగుల సమయంలోనైనా అందరు కుటుంబ సభ్యులతో కనీసం రెండు మూడు రోజులైనా గడపాలని చెప్పారు. అలా చేస్తే పిల్లలకు అనుబంధాల్లో ఉండే ఆత్మీయత తెలుస్తుందన్నారు. అప్పుడే వారిలో హింసా ప్రవృత్తి కాస్తలో కాస్తయినా తగ్గుతుందని.. నేరాలు కూడా తగ్గుతాయని విశ్లేషించారు.
Also Read: Tollywood Actors: అందులో టాలీవుడ్ హీరోలే టాప్.. అది సార్ మన బ్రాండ్