Summit of Fire: ఖతార్‌లో తలదాచుకుంటున్న హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ మరో సరికొత్త మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్ (Summit of Fire) పేరిట ఖతార్ రాజధాని దోహా నగరంలో మంగళవారం ‘ఎయిర్ స్ట్రైక్స్’ చేపట్టింది. నగరంలోని పలుచోట్ల ఒకేసారి పేలుళ్లు సంభవించాయి. దీంతో, దోహా నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడులు తామే చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది. అయితే, ఈ దాడులు ఎక్కడ జరిగాయి, ఎంతమంది చనిపోయారనే వివరాలను మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దాడిలో హమాస్ నేతలు చనిపోయారా?, లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
Read Also- Siachen Avalanche Tragedy: మంచుకొండ చరియలు విరిగిపడి ముగ్గురు సైనికులు కన్నుమూత
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), భద్రతా సంస్థ (ISA) సహకారంతో హమాస్ ఉగ్రవాద సంస్థ ఉన్నతస్థాయి నేతలే లక్ష్యంగా కచ్చితత్వంతో కూడిన దాడులు జరిపామని ప్రకటనలో పేర్కొంది. ‘‘మేము గురిపెట్టిన హమాస్ నేతలు గత కొన్నేళ్లుగా ఉగ్ర సంస్థను నడిపిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్ర నరమేధానికి ప్రధాన బాధ్యులు వీళ్లే. ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై జరుగుతున్న యుద్ధాన్ని కూడా నడిపిస్తున్నది వీళ్లే’’ అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ఒకరు స్పందిస్తూ, దోహా నగరంలో మంగళవారం జరిగిన దాడి సమ్మిట్ ఆఫ్ ఫైర్’ అనే ఆపరేషన్‌లో భాగంగా నిర్వహించామన్నారు. ఇది ఎయిర్ స్ట్రైక్ అని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రధాన అధికారి ఎయాల్ జమీర్ ఆగస్టు 31న మాట్లాడుతూ, హమాస్ నాయకత్వం ఎక్కువగా విదేశాల్లో ఉందన్నారు. తాము కచ్చితంగా వారిన చేరుకుంటామని హెచ్చరించారు. ఆయన చెప్పిన 10 రోజుల వ్యవధిలోనే దోహాలో దాడులు జరగడం గమనార్హం.
Read Also- Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయం.. కవిత కీలక వ్యాఖ్యలు
తీవ్రంగా ఖండించిన ఖతారు
దోహాలో ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్‌ను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ‘‘ మా దేశ రాజధానిలో హమాస్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. జనావాస ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఇదొక నేరపూరిత చర్య’’ అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేడ్ అల్అన్స్‌రి వ్యాఖ్యానించారు. తమ దేశంలోని విదేశీయులకు, ఖతార్ వాసుల భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ కూడా ఈ ఎయిర్ స్ట్రైక్స్‌ను ఖండించారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు. శాంతియుత పరిష్కారం దిశగా పనిచేయాలని ఇరుదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, గజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తులు వ్యవహరిస్తున్న దేశాల జాబితాలో ఈజిప్ట్, ఖతార్ ఉన్నాయి.