Siachen Avalanche Tragedy: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంగా గుర్తింపు పొందిన లడఖ్‌లోని సియాచిన్‌లో మరో విషాదం (Siachen Avalanche Tragedy) చోటుచేసుకుంది. సియాచిన్ బేస్ క్యాంప్ వద్ద మంచుకొండ చరియలు విరిగిపడి ముగ్గురు ఆర్మీ సైనికులు అమరులయ్యారు. భారీ మంచుగడ్డల కింద చిక్కుకొని ముగ్గురూ కన్నుమూశారు. చనిపోయినవారిలో ఇద్దరు అగ్నివీర్లు ఉన్నారు. మృతులు మహార్ రెజిమెంట్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరు గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 5 గంటల పాటు మంచు కింద ఉండి ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఒక ఆర్మీ కెప్టెన్‌ను సురక్షితంగా కాపాడామని వెల్లడించారు.
కాగా, సియాచిన్ హిమానీనదం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుపొందింది. చైనా సరిహద్దు రేఖ ‘లైన్ ఆఫ్ కంట్రోల్’కు సమీపంలో ఉంటుంది. సియాచిన్ హిమానీనదం సముద్ర మట్టానికి సుమారు 20,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత కఠినంగా ఉంటాయి. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పడిపోతుంటుంది. గతంలోనూ ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు కొన్ని జరిగాయి. 2021లో, సబ్-సెక్టార్ హనీఫ్ ప్రాంతంలో మంచుకొండ చరియలు విరిగిపడి ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అప్పుడు 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి కొందరు సైనికుల ప్రాణాలను రక్షించారు.
Read Also- CP Radhakrishnan: భారత 14వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. తెలుగు అభ్యర్థిపై గెలుపు
ప్రాణాలు తీస్తున్న దుర్ఘటనలు
సియాచిన్ హిమానీనదంలో మంచుకొండచరియలు విరిగిపడి గణనీయ సంఖ్యలో సైనికులు మృతి చెందుతున్నారు. 2019లో భారీ ప్రమాదం జరిగింది. మంచుకొండచరియలు విరిగిపడి నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు (వస్తువులు మోసేవారు) చనిపోయారు. సముద్ర మట్టానికి సుమారు 18,000 అడుగుల ఎత్తులో 8 మంది సైనికులు గస్తీ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 2022లో మరింత ఘోర విషాదం జరిగింది. ఆ ఏడాది అరుణాచల ప్రదేశ్‌లోని కమెంగ్ ప్రాంతంలో ఏకంగా ఏడు సైనికులు కన్నుమూశారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో గల్లంతైనవారి మృతదేహాలను వెలికితీయడానికి ఏకంగా మూడు రోజులు పట్టింది.
మంచుకొరియలు ప్రమాదకరంగా మారడంతో ఇండియన్ ఆర్మీ 2022 సంవత్సరంలో తొలిసారిగా స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి 20 రెస్క్యూ వ్యవస్థలను కొనుగోలు చేసింది. సియాచిన్ హిమానీనదం, కశ్మీర్, ఈశాన్య భారత్‌లోని అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో హిమానీనదాల ప్రమాదాలు, తీవ్రమైన తుఫాన్ల కారణంగా పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఈ వ్యవస్థలను కొనుగోలు చేశారు.
Read Also- K-Ramp Movie Song: ‘కె ర్యాంప్’ సినిమా నుంచి లిరికల్ వచ్చేసింది.. వారి కెమిస్ట్రీ కుదిరిందిగా..