CP Radhakrishnan: మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ బలపరిచిన బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. విపక్షాల ఇండియా కూటమి అభ్యర్థి బీ సుదర్శన్ రెడ్డిపై సీపీ రాధాకృష్ణన్ సునాయాస విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 767 మంది ఎంపీలు ఓటు వేశారు. అందులో సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు పడగా, విపక్షాల అభ్యర్థి అయిన తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి 300 ఓట్లతో సరిపెట్టుకున్నారు. విపక్షాలు ఆశించిన స్థాయిలో ఓట్లు పడకపోవడంతో కొన్ని పార్టీల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్ష పార్టీలను ఈ ఫలితంగా స్పష్టం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్న సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుత వయసు 68 ఏళ్లు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గౌండర్-కొంగు వేల్లలార్ (OBC) సామాజిక వర్గానికి చెందినవారు.
Read Also- Formula E Case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కీలక స్టెప్.. ఏం జరగబోతోంది?
భారీగా క్రాస్ ఓటింగ్
నిజానికి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఎన్నికకు ముందే ఖరారైంది. సంఖ్యాబలం అనుకూలంగా ఉండడంతో ఎన్డీయే తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన గెలుపు ఖాయమనే రాజకీయ నిపుణులు విశ్లేషించారు. ఫలితం కూడా అలాగే వచ్చింది. అయితే, ప్రతిపక్ష ఎంపీల నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం జరిగిన ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలకు గానూ 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 98.2 ఓటింగ్ శాతం నమోదైంది. పోల్ అయిన వాటిలో15 ఓట్లు చెల్లని ఓట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉన్న పీసీ మోదీ ప్రకటించారు. మరో 13 మంది ఎంపీలు ఓటింగ్‌కు హాజరు కాలేదు. వీరిలో బీజేడీకి చెందిన ఏడుగురు, బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు, శిరోమణి అకాలీ దళ్‌కు చెందిన ఒకరు, ఒక స్వతంత్ర ఎంపీ ఉన్నారు.
ఎన్‌డీఏ పార్టీలకు మొత్తం 425 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (11 ఎంపీలు) మద్దతుతో కలిపి మొత్తం బలం 436గా అంచనా వేశారు. ఇక, ఇండియా బ్లాక్‌కు 324 ఎంపీల మద్దతు ఉంది. ఈ అంచనాలకు విరుద్దంగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే, ఏకంగా 24 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్టుగా స్పష్టమవుతోంది.
Read Also- Balendra Shah: నేపాల్ తదుపరి ప్రధానిగా బలేంద్ర షా? నిరసనకారుల మద్దతు కూడా అతడికే!
కాగా, ఈ ఏడాది జులై 21న మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున అనారోగ్య కారణాలను చూపుతూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన 50 రోజుల తర్వాత ఎన్నిక జరిగింది.