Asim Munir: పాక్ సైన్యానికి (Pak Army) తెహ్రిక్ – ఈ – తాలిబన్ పాకిస్థాన్ (Tehrik-e Taliban Pakistan – TTP) మధ్య గత కొద్దికాలంగా భీకరపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీటీపీ అగ్రనేతకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ.. ఆ దేశంపైనా పాక్ సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఇరుదేశాల సరిహద్దుల వద్ద ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ టీటీపీ కమాండర్.. పాక్ ఆర్మీ చీఫ్ ను బహిరంగంగా హెచ్చరించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
‘నువ్వు నిజమైన మగవాడివైతే’
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan’s army chief), ఫీల్డ్ మార్షల్ (Field Marshal) అసీం మునీర్ (Asim Munir)ను హెచ్చరిస్తూ తెహ్రిక్ – ఈ – తాలిబన్ పాకిస్థాన్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఓ టీటీపీ కమాండర్ మాట్లాడుతూ ఆసీం మునీర్ పై విరుచుకుపడ్డారు. తమవారిని పాక్ ఆర్మీ టార్గెట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మమ్మల్ని చంపడానికి సైన్యాన్ని పంపొద్దు. మీరే స్వయంగా యుద్ధరంగంలోకి దిగండి’ అంటూ అసీం మునీర్ కు సవాలు విసిరాడు. ‘నువ్వు నిజమైన మగవాడివైతే.. మా ముందుకు రా’ అని ఛాలెంజ్ చేశాడు. అయితే వీడియోలో సవాలు విసిరిన వ్యక్తిని టీటీపీ సీనియర్ కమాండర్ ఖాజీం (Commander Kazim)గా పాక్ సైన్యం గుర్తించింది. అతడ్ని పట్టించిన వారికి రూ.10 కోట్ల పాకిస్థాన్ రూపాయలను బహుమానంగా ప్రకటించింది.
వీడియోలో భీకర దాడి దృశ్యాలు
టీటీపీ విడుదల చేసిన వార్నింగ్ వీడియోలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని కుర్రం ప్రాంతంలో అక్టోబర్ 8న జరిగిన దాడి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని టీటీపీ పేర్కొంది. దాడి తరువాత సైన్యం నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, వాహనాలను కూడా వీడియోలో చూపించింది. అయితే, పాకిస్తాన్ అధికార వర్గాల ప్రకారం.. ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే మరణించారు.
పాక్ – అఫ్గాన్ కాల్పుల విరమణ
టీటీపీ మూలంగా పాక్ – అఫ్గాన్ మధ్య బీకర దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు సాగిన కాల్పులు, వైమానిక దాడుల్లో ఇరు దేశాలకు చెందిన సైన్యం, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో టర్కీ మధ్యవర్తిత్వంతో ఖతార్ వేదికగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అయితే పాక్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. ఈ శాంతి కొనసాగాలంటే అఫ్గాన్ భూభాగం నుండి పనిచేస్తున్న టీటీపీపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది.
Also Read: Jubliee Hills Bypoll Survey: సంచలన సర్వే.. బెడిసికొట్టిన కాంగ్రెస్ – ఎంఐఎం వ్యూహం.. మైనార్టీల మద్దతు ఎవరికంటే!
ఆనందంలో ఇతర ఉగ్రసంస్థలు
పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. TTP విజయాలు ఇతర తీవ్రవాద సంస్థలకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. వీటిలో లష్కర్-ఏ-జంగ్వీ (LeJ), ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ (ISKP), జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు ఉన్నాయి. లష్కర్-ఏ-జంగ్వీ గతంలో పాకిస్తాన్‌లో వెనకబడిన వర్గాలపై దాడులకు తెగపడింది. ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ సంస్థ.. పాక్ పై అసంతృప్తితో ఉన్న మిలిటెంట్లను ఆకర్షించి ఉగ్రసంస్థగా ఏర్పాటైంది. అది తమ దేశంలో పలుమార్లు దాడులకు పాల్పడినట్లు పాక్ మీడియా పేర్కొంది.
