Sun Degree College: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న సన్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత పది రోజుల క్రితం ఓయూ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో ఈ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించగా, కాలేజీ ఆగడాలు బహిర్గతమైనట్లు ఓయూ అధికారులు పరోక్షంగా మీడియాకు సమాచారం అందించారు. అయినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Nursing Schools Scam: రాష్ట్రంలో నర్సింగ్ స్కూల్స్ దందాలు.. పట్టించుకోని అధికారులు
నివేదిక సమర్పణలో ఆలస్యం
ఓయూ వైస్ ఛాన్సలర్ (వీసీ) ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు తనిఖీ నివేదికను సమర్పించడంలో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓయూ పేరుతో ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్ యూనివర్సిటీ కోర్సులను నడిపించడం చట్ట విరుద్ధం. కానీ సన్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలకు నీళ్లు వదిలి యథేచ్ఛగా ఇతర యూనివర్సిటీ కోర్సులను నడిపిస్తుండటం విడ్డూరంగా ఉంది. రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కేవలం నోటీసులు ఇచ్చి, తనిఖీలకే పరిమితం చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలు
ఓయూ డిగ్రీ పేరుతో నడిచే సన్ కాలేజీలో ఇతర యూనివర్సిటీ కోర్సులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. క్రైస్తవ జన సమితి అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ జూలై 16న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఓయూ అధికారులు కళాశాలకు నోటీసులు ఇచ్చి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సన్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులతో సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోయినా, ఫీజులు చెల్లించి నేరుగా పరీక్షలకే హాజరవుతున్న సందర్భాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఓయూ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వ్యవహరించినట్లు స్పష్టమైంది. తప్పుడు విధానాలతో కళాశాలలను నడిపించే యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు ఎందుకు లెక్కిస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పేరుకు కలంకం తెచ్చే ఏ యాజమాన్యాన్ని వదిలిపెట్టకూడదని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఓయూ డిగ్రీలో ఢిల్లీ కోర్సులు అంతర్భాగమా!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాంనగర్, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో నడిచే సన్ డిగ్రీ కళాశాల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే భవనంలో ఉస్మానియా యూనివర్సిటీ అనుమతితో పాటు ఇతర యూనివర్సిటీ కోర్సులు నడపడం అనేది 2020 ఓయూ సర్క్యులర్‌కు వ్యతిరేకం. అందుకు పూర్తి భిన్నంగా సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వ్యవహరించడం శోచనీయం. సీజేఎస్ ఫిర్యాదుతో కళాశాలను సందర్శించిన ప్రొఫెసర్ కిషన్ అక్కడి వ్యవహారం చూసి షాక్‌కు గురైనట్లు తెలుస్తుంది. ఓయూ అనుమతితో నడిచే కళాశాలలో ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్‌కు సంబంధించిన కోర్సులు విద్యార్థులకు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా, ఓయూ విద్యార్థుల కంటే ఇతర యూనివర్సిటీ విద్యార్థుల సంఖ్యే అత్యధికంగా ఉన్నట్లు ప్రొఫెసర్ వివరించారు. ఆ యూనివర్సిటీ కోర్సులకు, ఓయూ కోర్సులకు సంబంధం ఏమిటనే ప్రశ్న మిగిలిపోయింది. వాస్తవానికి, ఓయూ డిగ్రీలో ఢిల్లీ కోర్సులు అంతర్భాగంగానే కొనసాగుతున్నాయి.
Also Read:NIMS Hyderabad: విద్యార్థి మృతికి ఉద్యోగులే కారణమా?.. నిమ్స్‌పై స్వేచ్ఛ వరుస కథనాలు
