Jubliee Hills Bypoll Survey: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. అధికార కాంగ్రెస్ (Congress)తో పాటు విపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ పార్టీలు.. గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసి.. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అయితే జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో దాదాపు 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ లో పట్టు ఉన్న ఎంఐఎం పార్టీ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతు గా నిలవడంతో మైనారిటీ ఓటు బ్యాంక్ అధికార పార్టీ అభ్యర్థికి షిఫ్ట్ అవుతుందని అంతా భావించారు. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
కాంగ్రెస్ కాదు.. బీఆర్ఎస్‌కు మద్దతు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ (ముస్లీం) ఓటర్ల మద్దతు ఎవరికో తెలుసుకునేందుకు బిలియన్ కనెక్ట్ (Billion Connect) అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి (మాగంటి సునీత)కి 50 శాతానికి పైగా మైనారిటీలు మద్దతు తెలపడం గమనార్హం. సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10 నుంచి 21 తేదీ మధ్య 6,865 మంది మైనారిటీలపై అధ్యయనం చేశారు. వీరిలో 79 శాతం పురుషులు, 21 శాతం స్త్రీలు ఉన్నారు. అయితే వీరిలో సగానికి పైగా బీఆర్ఎస్ కు ఓటు వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3.99 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ సర్వేలో అతి తక్కువ మంది మైనార్టీ ఓటర్లనే పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఫలితాల ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్వే ఫలితాలు
బిలియన్ కనెక్ట్ సర్వే ప్రకారం.. అన్ని వయసులు, వర్గాల ఓటర్లలో బీఆర్‌ఎస్‌కు 50% కంటే ఎక్కువ స్థిరమైన మద్దతు లభించింది. కాంగ్రెస్ మద్దతుదారులు 21% – 32% మధ్యలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా సేకరించిన డేటాలో కూడా షేక్‌పేట్, సమతా కాలనీ మినహా మిగతా ప్రాంతాలన్నింటిలోనూ 50% కంటే ఎక్కువ మంది బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపినట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి తోడు 69% మంది ప్రజలు.. మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని 9.7% మంది అసంతృప్తిగా ఉన్నారని తేలింది.
అవినీతి పార్టీలని ముద్ర
ఈ సర్వేలో పార్టీల పట్ల తమ అభిప్రాయాన్ని సైతం ఓటర్లు తెలియజేశారు. అధికారంలోకి వచ్చి కేవలం రెండేళ్లు అయినప్పటికీ 22.6% మంది కాంగ్రెస్‌ను అత్యంత అవినీతిపరమైన పార్టీగా పేర్కొన్నారు. 10.7% మంది బీఆర్‌ఎస్‌ను, 31.3% మంది AIMIMను, 39.4% మంది BJPని అత్యంత అవినీతిపరమైన పార్టీగా అభిప్రాయపడ్డారు. అయితే నియోజకవర్గంలో సామాజిక ఐక్యతను కాపాడటంలో భాగంగా 59.9% మంది బీఆర్‌ఎస్‌ను ఎంపిక చేసుకున్నట్లు సర్వే సంస్థ తెలిపింది.
Also Read: Sun Degree College: ఓయూ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలు.. విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలు
కాంగ్రెస్‌కు గెలుపు తప్పనిసరి..
2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటును కూడా అధికార కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. దీంతో రాజధాని నగరంలో కాంగ్రెస్ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్లు అయ్యింది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకొని.. తమ రెండేళ్ల పాలనకు ప్రజల సపోర్ట్ ఉందని నిరూపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ఎంఐఎం మద్దతును సైతం కాంగ్రెస్ తీసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత (మాగంటి గోపినాథ్ భార్య) బరిలో ఉన్నారు.
