US Obesity Study: అగ్రరాజ్యం అమెరికాలో ఉబకాయంతో బాధపడే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో దేశంలో 70 శాతం మంది ప్రజలు ఒబేసిటీ (అధిక కొవ్వు)తో బాధపడుతున్నట్లు తేలింది. జామా నెట్ వర్క్ ఓపెన్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అమెరికా జనాభాలో ఒబేసిటీ శాతం 68.6 శాతానికి పెరిగింది.
అధ్యయనం ఏం చెబుతోంది..
అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. 18-80 ఏళ్ల మధ్య ఉన్న 3.01 లక్షల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో బీఎంఐ (Body mass index) పరిమితి (BMI = 30)ని దాదాపు 43 శాతం మంది దాటేశారు. వారంతా ఓబీస్ గా గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. గత అధ్యయనంతో పోలిస్తే పురుషుల్లో ఓబెసిటీ 32.5 శాతం పెరగ్గా స్త్రీలలో ఇది 21.7 శాతంగా నమోదైంది. ఆసియా మూలాలు ఉన్న అమెరికన్స్ లో గతంతో పోలిస్తే ఒబేసిటీ 27 శాతం నుండి 51 శాతానికి పెరిగింది. మరోవైపు 70 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులలో ఏకంగా 78% మంది అధిక కొవ్వుతో బాధపడుతున్నారు.
‘చికిత్స విధానం మార్చాల్సిందే’
‘మనం ఇప్పటికీ ఒబేసిటీ సమస్యను పెద్దదిగా భావించట్లేదు. కానీ పెద్దలలో సుమారు 70 శాతం మందికి అధిక కొవ్వు ఉన్నట్లు స్టడీలో తేలింది. కాబట్టి వారికి చేసే చికిత్సా విధానాలను పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది’ అని అధ్యయనకర్త, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కి చెందిన ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ లిండ్సే ఫోర్‌మన్ అభిప్రాయపడ్డారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ప్రజా ఆరోగ్యంపై ప్రభావం
అమెరికా పెద్దలలో సుమారు 70 శాతం మంది ఒబీస్‌గా తేలడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిందేనని సూచిస్తున్నారు. పిజ్జా, బర్గర్, స్వీట్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అతిగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వాటి బదులు ఫైబర్, పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. అలాగే రోజూ శారీరక వ్యాయామం చేయాలని స్పష్టం చేస్తున్నారు. వీటికి తోడు క్రమం తప్పకుండా షుగర్, కొలెస్ట్రాల్, రక్తపోటు తదితర పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.
