Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, వీహెచ్ హనుమంతరావు సమక్షంలో షేక్ పేట్ ఆర్ఓ ఆఫీసులో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో జూబ్లీహిల్స్ లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం సవాల్
నవీన్ యాదవ్ నామినేషన్ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజల దృష్టి మళ్లించడానికి ఓటు చోరీ అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చిందని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బేజీపీ (కేంద్రం) జూబ్లీహిల్స్ కు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పొన్నం సవాలు విసిరారు.
ప్రజాభిప్రాయం మేరకే నవీన్
ప్రజల అభిప్రాయం మేరకే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను నిలబెట్టినట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతోందని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గణేష్ ను గెలిపించినట్లే.. జూబ్లీహిల్స్ లో నవీన్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ను రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Also Read: CPM – Raj Bhavan: సీపీఎంకి గవర్నర్ ఝలక్.. కలిసేందుకు నిరాకరణ.. రాజ్ భవన్ వద్ద నేతల ఆందోళన
‘కాంగ్రెస్ గెలుపు ఖాయం’
మరోవైపు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవీన్ యాదవ్ సరైన అభ్యర్థి అని ప్రశంసించారు. నవీన్ ను నమ్మి కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇచ్చిందని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీల ఆశీర్వాదం నవీన్ కు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అందరూ నవీన్ కు అండగా ఉన్నారని హనుమంతరావు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఎవరు పడితే వారు నామినేషన్ వేస్తున్నారని.. చివరికి గెలిచేది నవీన్ యాదవ్ మాత్రమేనని హనుమంతరావు దీమా వ్యక్తం చేశారు.

