COVID new variant: కరోనా మహమ్మారి గురించి అందరూ మరచిపోతున్న తరుణంలో, అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల కొత్త కొవిడ్-19 వేరియంట్ (COVID new variant) కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ కొత్త వేరియంట్‌కు ఎక్స్‌ఎఫ్‌జీ (XFG) అని పేరు పెట్టారు. దీనిని ‘స్ట్రాటస్’ అని కూడా పిలుస్తున్నారు. అమెరికాలో వేసవి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిచెందుతున్న మూడవ వేరియంట్‌గా గుర్తించారు. ఈ వైరస్ కేసులు యూరప్‌లోని పలు దేశాల్లో కూడా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్స్ఎఫ్‌జీ వేరియెంట్‌ను మొదటిసారి 2025 జనవరిలో దక్షిణాసియాలో గుర్తించారు. మే నెల వరకు అమెరికాలో ఈ వేరియంట్ కారణంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, జూన్‌లో అనూహ్యంగా భారీ సంఖ్యలో పెరిగాయి.
అమెరికా ప్రభుత్వ సంస్థ సీడీసీ (Centers for Disease Control and Prevention) గణాంకాల ప్రకారం, ఎక్స్‌ఎఫ్‌జీ వేరియెంట్ కారణంగా కేసుల పెరుగుదల మార్చిలో 0 శాతం, ఏప్రిల్‌లో 2 శాతంగా, మే చివరలో 6 శాతం, జూన్ ప్రారంభంలో 11 శాతం, జూన్ చివరికి 14 శాతం చొప్పున కేసుల్లో పెరుగుదల నమోదయిందని తెలిపింది.
కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నట్టుగా ఈ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ కారణంగా తీవ్ర లేదా, అతి తీవ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని సీడీసీ పేర్కొంది. అలబామా, అలాస్కా, కాలిఫోర్నియా, డెలావేర్, ఫ్లోరిడా, హవాయి, కెంటకీ, లూసియానా, టెక్సస్ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు వేగంగా పెరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనెక్టికట్, జార్జియా, ఇండియానా, మేరీల్యాండ్, మిచిగాన్, మినెసోటా, మిసిసిపీ, మిస్సోరీ, న్యూజెర్సీ, న్యూయార్క్, నార్త్ కరోలినా, ఓహియో, ఓక్లహామా, ఒరెగాన్, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, వాషింగ్టన్‌లలో కూడా కేసులు నమోదవుతున్నాయి.
Read Also- Virat – Rohit: విరాట్, రోహిత్ శర్మ ఆశలపై బీసీసీఐ నీళ్లు!
లక్షణాలు ఇవే..
ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ సోకితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని సీడీసీ తెలిపింది. జ్వరం లేదా జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడకపోవడం,
గొంతునొప్పి, ముక్కు కారడం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, అలసట, కీళ్లనొప్పులు లేదా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు లేదా మలబద్ధకం వంటి సమస్యలను రోగులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.
Read Also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఏమిటీ ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్?
కాగా, ఎల్‌ఎఫ్.7, ఎల్‌పీ.8.1.2 అనే రెండు లైనేజ్‌ల కలయికతో (recombinant variant) ఎక్స్‌ఎఫ్‌జీ వేరియెంట్ ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దీనికి సంబంధించిన తొలి శాంపిల్స్‌ను 2025 జనవరి 27న సేకరించినట్టు పేర్కొంది. జూన్ నెలలో విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం, ఎక్స్‌ఎఫ్‌జీ వేరియంట్ ప్రస్తుత స్టేటస్ వీయూఎంగా (Variant Under Monitoring) ఉంది. ఎక్స్‌ఎఫ్‌జీ వేరియెంట్‌కు తోడు నింబస్ (NB.1.8.1) అనే కొవిడ్ వేరియెంట్ కూడా అమెరికాలో విజృంభిస్తోంది. సీడీసీ గణంకాల ప్రకారం, ఎన్‌బీ.1.8.1 వేరియంట్ కూడా అమెరికాలో కేసుల పెరుగులకు కారణంగా ఉంది. ఈ వేరియెంట్ సోకితే బాధితుల్లో తీవ్రమైన గొంతు నొప్పి వస్తోంది.