Virat – Rohit: భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Virat – Rohit) ఇటీవలే టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల వైదొలిగారు. అయితే, ఇప్పటికీ వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. వారివురు లేకుండానే టీ20, టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా దూసుకెళుతోంది. అయితే, వన్ ఫార్మాట్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ సారధిగా కొనసాగుతున్నాడు. ఇక, విరాట్ ఎప్పటి మాదిరిగానే టీమ్ చాలా ప్రభావవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. ‘2027 వరల్డ్‌కప్’లో ఆడాలనేది ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు లక్ష్యంగా ఉంది. అయితే, అందుకు గ్యారంటీ లేదని తెలుస్తోంది. ఇద్దరి భవిష్యత్తుపైనా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థలో ఆసక్తికరమైన కథనం వెలువడింది. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో విరాట్, రోహిత్ ఆడడం అంత తేలిక కాకపోవచ్చని తెలిపింది. వన్డే ఫార్మాట్‌లలో ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ వన్డే వరల్డ్ కప్‌కు సెలక్ట్ చేయడం అంత సులువుకాదని తెలిపింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఇద్దరికీ 2027 వరల్డ్‌కప్ జట్టులో స్థానంపై గ్యారంటీ ఇవ్వలేదని ‘దైనిక్ జాగరణ్’ కథనం పేర్కొంది. ఇద్దరూ ప్రస్తుతం టెస్టులు, టీ20 ఫార్మాట్లలో ఆడటం లేదు కాబట్టి వచ్చే రెండేళ్లలో వారి ప్రాక్టీస్ బాగా తగ్గిపోతుందని, అలాంటి పరిస్థితి వస్తే వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే విషయంలో సెలక్షన్ కమిటీకి, బీసీసీఐ పెద్దలు మొగ్గుచూపకపోవచ్చని విశ్లేషించింది.
Read Also- TS News: బడా బాబులకు సహకరిస్తున్న పోలీసు అధికారులు!
దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..
ఈ ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లు డిసెంబర్‌లో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ ఆడితేనే వరల్డ్‌కప్ సెలక్షన్‌కు సంబంధించిన పరిశీలనలోకి వస్తారని ‘దైనిక్ జాగరణ్’ పేర్కొంది. దేశవాళీ క్రికెట్ ఆడకపోతే వారికి అవకాశాలు తలుపు తట్టే అవకాశమే లేదని చెప్పింది.
టెస్ట్ రిటైర్మెంట్ అందుకేనా?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలకు సరిపోరని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపినట్టు ‘దైనిక్ జాగరణ్’ కథనం తెలిపింది. విరాట్, రోహిత్ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్ కోసం తాము రూపొందించిన ప్రణాళికల్లో లేరని చెప్పారని పేర్కొంది. నిజానికి, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తామని ఈ ఇద్దరూ సెలక్టర్లకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ, ఎంపిక చేసే అవకాశం తక్కువని క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే, టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్టు కథనం వివరించింది.
Read Also- Nani Filmfare Award: 2025 ఫిల్మ్‌ఫేర్ అవార్డులో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌గా నాచురల్ స్టార్
ఈ ఏడాది అక్టోబరులో ఆసీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకవచ్చని రిపోర్టు పేర్కొంది. విరాట్, రోహిత్ ఈ దశలో తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని కూడా కథనం విశ్లేషించింది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఆకట్టుకోవడంతో సెలక్షన్ కమిటీకి అతడిపై గట్టి నమ్మకం కలిగించిందని సమాచారం. భవిష్యత్తులో గిల్‌నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ చేయాలన్న ఆలోచనకు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో జట్టు విజయవంతంగా రూపాంతరం చెందింది. అదే మార్పు వన్డేల్లో కూడా జరగనుందని అంచనాగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో విరాట్, రోహిత్ భవితవ్యం అస్పష్టంగా మారింది.