Hyderabad-Police
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

TS News: బడా బాబులకు సహకరిస్తున్న పోలీసు అధికారులు!

TS News: చట్టం కొందరికి చుట్టం!

బడా బాబులకు సహకరిస్తున్న కొందరు అధికారులు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదనలు
తరచూ వెలుగుచూస్తున్న అవినీతి అధికారుల బాగోతాలు
అయినా పట్టించుకోని పోలీస్ బాసులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: చట్టం నిజంగానే కొందరికి చుట్టమా?…హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలిని గమనిస్తే వచ్చే సందేహం ఇది. చిన్నాచితకా నేరాలు చేసిన వారిని అరెస్టులు చేసి హడావుడి చేసే సదరు అధికారులు.. లక్షల్లో మోసాలు చేస్తున్న వారి మాత్రం వదిలేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వివాదాస్పద స్థలాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నవారిని విడిచి పెట్టేస్తున్నారు. దీంతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చోరీ కేసుల్లో సొత్తును రికవరీ చేస్తున్నా బాధితులకు పూర్తిగా ఇవ్వకుండా కొంత తినేస్తున్నారు. అదేమని అడిగితే ఇచ్చింది తీసుకోండి…లేకపోతే కోర్టులో డిపాజిట్ చేస్తామంటూ బెదరగొడుతున్నారు.

గాలిస్తూనే ఉన్నారు…
డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్​… నిమ్స్‌లో అదనపు మెడికల్ సూపరిండింటెంట్. తనతో పాటు వైద్య విద్య చదివిన స్నేహితుడు డాక్టర్ వీట్ల శ్రీరాములుకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్లాటు ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.50 లక్షలకు ముంచాడు. దీనిపై డాక్టర్ శ్రీరాములు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు మొదట కేసు నమోదు చేయలేదు. చేసేదేమీ లేక బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటంతో తప్పనిసరై బీఎన్ఎస్ 316(2), 316(5), 318(1), 318(4), 336(1), 336(3), 338, 175(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఇది జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల వైఖరిపై ప్రశ్నిస్తే అతడి కోసం గాలిస్తున్నామని సమాధానాలు చెబుతున్నారు. అయితే, డాక్టర్ లక్ష్మీభాస్కర్ బంజారాహిల్స్ స్టేషన్‌కు వచ్చి వెళుతున్నట్టు అదే స్టేషన్‌లో పని చేస్తున్న కొందరు సిబ్బందే చెబుతుండటం గమనార్హం. ఆర్థికంగా బలంగా ఉన్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని అరెస్ట్ కాకుండా పోలీసులను మేనేజ్​ చేస్తున్నాడన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా డాక్టర్ లక్ష్మీభాస్కర్ వ్యవహారం వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే…
తన పొజిషన్‌లో ఉన్న భూమిని ఆరా మస్తాన్ అనే వ్యక్తి కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ రమేశ్​ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఈస్ట్ జోన్ పోలీసులు ఏమాత్రం స్పందించ లేదు. పైగా, సెటిల్​ చేసుకోండి అంటూ జోన్ ఉన్నతాధికారి ఒకరు ఉచిత సలహా ఇవ్వటం గమనార్హం. మెట్టుగూడ సర్వే నెంబర్ 733లో ఉన్న 5,717 గజాల స్థలానికి సంబంధించి చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. 60 యేళ్లుగా తన పొజిషన్‌లో ఉన్న భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆరా మస్తాన్ ఆక్రమించే యత్నం చేస్తున్నట్టుగా రమేశ్​ అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్ట్రేషన్​ చేశారని వివరించాడు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని కూడా దానికి జత చేశాడు. అయినప్పటికీ దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక, వేర్వేరు పార్టీలకు చెందిన బడా నేతలతో సన్నిహిత పరిచయాలు ఉన్న జోన్‌కు చెందిన ఓ ముఖ్య అధికారిని మేనేజ్ చేసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద స్థలంలో రమేశ్​ తరపున వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వ్యక్తి కుటుంబాన్ని ఆరా మస్తాన్ మనుషులు బెదిరించి వెళ్లగొట్టారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీనిపై రమేశ్​ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోక పోవటం గమనార్హం. దాంతో బాధితుడు రమేశ్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆరా మస్తాన్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆరా మస్తాన్ మనుషులు జేసీబీతో వచ్చి వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేయటం గమనార్హం. దీంట్లో కూడా భారీగా డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Read Also- Viral News: 10 గంటలకు శాలరీ పడింది.. 10.05కి రిజైన్.. హెచ్చార్ ఏమన్నారంటే?

ఫిర్యాదుదారుకే టోపీ
చిలకలగూడ సబ్​ డివిజన్​ పరిధిలోని ఓ స్టేషన్ సిబ్బంది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికే కుచ్చుటోపీ పెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తన ఇంట్లో పని చేసిన మహిళనే చోరీ చేసిందని బాధితుడు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా ఇచ్చాడు. దాంతో పోలీసులు ఆ మహిళను విశాఖపట్టణం నుంచి రప్పించారు. విచారణలో విజయవాడలో ఉన్న తన సోదరి వద్ద బంగారు నగలు దాచి పెట్టినట్టుగా ఆమె ఒప్పుకుంది కూడా. కానీ, విజయవాడ వెళ్లటానికి కావాలంటూ పోలీసులు ఫిర్యాదుదారు కారుతో పాటు దారి ఖర్చుల కోసమంటూ రూ.50 వేల నగదును తీసుకున్నారు. 6 తులాల బంగారాన్ని రికవరీ చేసినా 4తులాలు మాత్రమే ఫిర్యాదుదారికి ఇచ్చారు. స్టేషన్‌లో పని చేస్తున్న మరికొందరు సిబ్బంది ద్వారా వెలుగు చూసిన ఈ బాగోతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే పోలీసులు ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి ఇచ్చిన 4 తులాల బంగారు నగలను కూడా వెనక్కి తీసుకుని కోర్టులో డిపాజిట్ చేస్తామని, అక్కడి నుంచి తీసుకో అని చెప్పటం గమనార్హం.

చర్యలేవీ…
ఇలాంటి ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నా పోలీస్ బాసులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం అంతర్గత విచారణ కూడా జరిపించటం లేదు. చర్యలు తీసుకోవటం లేదు. దాంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనిపై పోలీసు వర్గాల నుంచే పలుకుబడి, పరపతి ఉంటే ఏమైనా చేయవచ్చా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. దారి తప్పిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పెడధోరణులు ఇంకా పెరిగి పోతాయని కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు.

Just In

01

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత

Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?

Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?