Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై (Operation Sindoor) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ శనివారం స్పందించగా .. ఇవాళ (ఆదివారం) ఇండియన్ ఆర్మీ చీఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది తొలిసారి అధికారికంగా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ఒక సాధారణ యుద్ధ మిషన్‌లా జరగలేదని, శత్రువు తర్వాతి ఎత్తుగడ ఏంటనేది తెలియకపోయినా భారత ఆర్మీ ముందుకెళ్లిందని, ఆపరేషన్ సిందూర్ ఒక చెస్ ఆటలా జరిగిందని ఆయన అభివర్ణించారు. భారత్ ఓ నిర్ణాయాత్మక చెక్‌మేట్ పెట్టిందని, పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించిందని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. తానే గెలిచినట్టుగా పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘ఆపరేషన్ సిందూర్ చెస్ ఆట మాదిరిగా జరిగింది. శత్రువు తర్వాతి కదలిక ఏమిటో, మనం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. దీనినే ‘గ్రేజోన్’ అంటారు. గ్రేజోన్ అంటే సంప్రదాయ యుద్ధం కాదు. మేము ఒక అడుగు ఎత్తుగడ వేస్తే.. శత్రువు కూడా తగిన విధంగా కదిలాడు’’ అని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. ‘‘ఒకచోట మేము వారికి చెక్‌మేట్ పెట్టాం. అక్కడ మనవాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టాల్సి వచ్చినా ఆ ఎత్తుగడ వేశాం. ఎదిరించి పోరాడాం’’ అని అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లడారు.
Read Also- Thammudu re release: ‘తమ్ముడు’ రీ-రిలీజ్.. సంబరాలు చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్
పాకిస్థాన్ వ్యూహాత్మక ప్రచారం
భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో గెలిచినట్టుగా పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను జనరల్ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. పాక్ చేస్తున్న తతంగం, వారు అనుసరిస్తున్న వ్యూహాత్మక కథన నిర్వహణపై (Narrative Management) ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్‌కు ఐదు స్టార్ జనరల్‌గా, ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం కూడా వ్యూహాత్మక ప్రచారంలో భాగమని జనరల్ ద్వివేది ఎద్దేవా చేశారు. వ్యూహాత్మక ప్రచార నిర్వహణను కాస్త శ్రద్ధగా గ్రహించాలని, ఎందుకంటే విజయం అనేది మనసులో ఉంటే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఒక పాకిస్థానీయుడిని ఎవరు గెలిచారని అడిగితే.. ఏమంటాడంటే, మా ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. కాబట్టి గెలిచినట్టే. అందుకే ఆయనకు ఆ పదవి వచ్చిందని చెప్తారు’’ అని జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు.
Read Also- Viral News: 10 గంటలకు శాలరీ పడింది.. 10.05కి రిజైన్.. హెచ్చార్ ఏమన్నారంటే?
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు 26 మంది పౌరులను హత్య చేసిన మారణహోమానికి ప్రతీకారంగా, మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించామని ద్వివేది తెలపారు. ప్రభుత్వ స్థాయిలో రాజకీయ సంకల్పం, వ్యూహంపై స్పష్టత ఆధారంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించామని ఆర్మీ చీఫ్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రితో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారంటూ ఆయన ప్రశంసించారు.
ఇంత కాన్ఫిడెన్స్ ఎప్పుడూ చూడలేదు
‘‘ఏప్రిల్ 23న మేము సమావేశం అయ్యాం. ఇక సహించేది లేదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పడం అదే మొదటిసారి. ఏదో ఒకటి చెయ్యాలని త్రివిధ దళాధిపతులు దృఢమైన అభిప్రాయంతో ఉన్నారు. మాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు. ఏం చెయ్యాలో మీరే నిర్ణయం తీసుకోండి అని అన్నారు. ఇంత కాన్ఫిడెన్స్‌గా చెప్పడం, రాజకీయ దిశ, రాజకీయ స్పష్టతను మేము తొలిసారి చూశాం’’ అని జనరల్ ద్వివేది వివరించారు. ఆపరేషన్ సిందూర్ అనే పేరును ఎంపిక చేయడంపై మాట్లాడిన ఆయన, ఒక చిన్న పేరు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఎంతో కీలకం అయ్యిందని అభిప్రాయపడ్డారు. ‘ఆపరేషన్ సిందూర్ పేరు దేశాన్ని ఒకచోటుకు తీసుకొచ్చింది. అందుకే దేశమంతా ఒకే ఒక్క ప్రశ్న సంధించింది. మీరు ఆపరేషన్ సిందూర్ ఎందుకు ఆపేశారు? అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చాం’’ అని జనరల్ ద్వివేది వివరించారు.