Nepal Gen Z protests: నేపాల్‌లో ప్రభుత్వ అవినీతి, ఇటీవల ఏకంగా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెల్లుబికాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ‘జెన్ జెడ్ విప్లవం’ (Gen Z Revolution) మొదలైంది. జెన్ జెడ్ తరానికి (21వ శతాబ్దపు ఆరంభంలో పుట్టినవారు) చెందిన యువత పెద్ద ఎత్తున వీధులు, రోడ్లపైకి వచ్చి ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రభుత్వ అవినీతికి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు సోమవారం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆన్‌లైన్ వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం, సోమవారం నేరుగా రోడ్లపైకి వచ్చింది. రాజధాని ఖాట్మండ్‌లో ఉన్న పార్లమెంట్ భవనం వద్దకు నిరసనకారులు దూసుకెళ్లారు. బారికేడ్లను దాటుకొని మరి వెళ్లి, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బందితో ఘర్షణలకు దిగారు. పార్లమెంట్ భవనానికి నిప్పు కూడా పెట్టారు. దీంతో, నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఏకంగా 14 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. కాగా, 21వ శతాబ్దపు ఆరంభంలో పుట్టినవారిని (1996 నుంచి 2010 వరకు) జెన్ జెడ్ జనరేషన్‌గా వ్యవహరిస్తుంటారు.
Read Also- Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!
కర్ఫ్యూ విధింపు
పరిస్థితి అదుపు తప్పడంతో నేపాల్ ప్రభుత్వం దేశంలో కర్ఫ్యూ విధించింది. పార్లమెంట్ పరిసరాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో, దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. చట్టబద్ధత ప్రకారమే ఆర్మీని రంగంలోకి దించామంటూ నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
సోషల్ మీడియాపై నిషేధంపై ఆగ్రహం
ఏకంగా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బ్లాక్ చేస్తూ సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యువత భగ్గుమన్నారు. జెన్ జెడ్ ఉద్యమానికి ఈ పరిణామమే తక్షణ కారణంగా ఉంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్‌తో పాటు ప్రముఖ యాప్స్, మరికొన్ని ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. నేపాల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ రిజిస్టర్ కాలేదని, అందుకే నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది.
Read Also- Meenakshi Natarajan: కాంగ్రెస్‌లోకి ఎవరైనా రావొచ్చు.. గేట్లు తెరిచే ఉన్నాయి.. మీనాక్షి నటరాజన్
రెగ్యులేషన్ కింద, నిబంధనల ప్రకారమే ఈ నిషేధాన్ని విధించామని ప్రభుత్వం చెబుతున్నా… ప్రభుత్వంపై విమర్శలను అణచివేసేందుకు తీసుకున్న చర్యగా నిరసనకారులు అభివర్ణిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఆంక్షలు విధించినప్పటికీ, టిక్‌టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాంలను వాడుతూ యువత సంఘటితంగా ఉద్యమాన్ని కొనసాగించారు. వేలాదిమంది సోమవారం రోడ్ల మీదకు వచ్చారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పన్నుల డబ్బు ఎక్కడికి పోయింది? అంటూ ప్లకార్డులతో ఖాట్మండ్ వీధులను హోరెత్తించారు. స్కూల్, కాలేజీ యూనిఫామ్స్‌లో వచ్చి మరీ నిరసనలు చేపట్టారు. నిరసన ర్యాలీ మైతిఘర్ నుంచి పార్లమెంట్ వరకు కొనసాగింది. పార్లమెంట్ భవనం వద్ద పోలీసులు ముందస్తుగానే బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఆగ్రహించిన యువత వాటిని దాటుకొని వెళ్లారు. నిరసన తీవ్రతను గమనించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ఉపయోగించారు. నిరసనకారులు చెట్ల కొమ్మలు, వాటర్ బాటిళ్లను పోలీసుల మీదకు విసిరారు. ఈ క్రమంలో కొందరు పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లి నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
నిజానికి ప్రభుత్వం అవినీతి, ఆర్థిక అసమానతలు, ప్రజల స్వరాన్ని అణచివేస్తుండడంపై నేపాల్ యువత చాలాకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కూడా నిషేధం విధించడంతో ఒక్కసారిగా భగ్గుమన్నారు.