UNSC: పాకిస్థాన్ సైన్యం దురాగతాలకు సంబంధించి భారత్ సంచలన ఆరోపణలు చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC)లో ‘శాంతి, మహిళల భద్రత’ అంశంపై చర్చ సందర్భంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. 1971 ప్రాంతంలో పాక్ ఓ సైనిక చర్య చేపట్టి.. ఏకంగా 4 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళపై పాక్ సైనికులు సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారని ఆయన ఆరోపించారు.
హరీష్ మాట్లాడుతూ…
‘ఐరాస వేదికగా నా దేశం గురించి పాక్ చేసే కట్టుకథ ప్రసంగాలను ప్రతీ సంవత్సరం వినాల్సి వస్తోంది. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్ గురించి వారు చేసే భ్రాంతి పూరిత ప్రసంగాలను చెవిన పడుతూనే ఉన్నాయి’ అని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి హరీష్ అన్నారు. అదే సమయంలో పాకిస్థాన్ లో మహిళా హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ‘1971లో పాకిస్థాన్ ‘ఆపరేషన్ సర్చ్‌లైట్’ అనే సైనిక చర్యను చేపట్టి తమ సొంత పౌరులైన 4 లక్షల బంగ్లాదేశ్ మహిళల (అప్పటికి బంగ్లాదేశ్ – పాక్ విడిపోలేదు) పై సామూహిక అత్యాచారాలకు పాల్పడింది. ప్రపంచం పాకిస్థాన్ ప్రచారాన్ని స్పష్టంగా చూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కాశ్మీరి మహిళల గురించి పాక్ ప్రతినిధి సైమా సలీం చేసిన అసత్య వ్యాఖ్యలకు కౌంటర్ గా హరీష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
#WATCH | At the UNSC Open Debate on Women Peace and Security, Permanent Representative of India to the UN, Parvathaneni Harish says, "Every year, we are unfortunately fated to listen to the delusional tirade of Pakistan against my country, especially on Jammu and Kashmir, the… pic.twitter.com/n91tpxgyIE
— DD News (@DDNewslive) October 7, 2025
సైమా సలీం ఏమన్నారంటే?
ఐరాస భద్రతా మండలిలో పాక్ ప్రతినిధి సైమా అలీ మాట్లాడుతూ మరోమారు కాశ్మీర్ పై విషం చిమ్మారు. ‘దశాబ్దాలుగా కశ్మీరీ మహిళలు బాధలు అనుభవిస్తున్నారు. యుద్ధాన్ని ఆయుధంగా చేసుకొని కాశ్మీర్ లోని మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. మహిళా మానవ హక్కుల రక్షకులు, పాత్రికేయులపై వేధింపుల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. బాధిత మహిళల కుటుంబాలపైనా ప్రతీకార చర్యలకు దిగారని ఆరోపించారు. కశ్మీరు మహిళలకు అండగా ఒక అజెండా తీసుకోగలిగే.. ప్రస్తుతం చర్చ జరుగుతున్న ‘మహిళలు, శాంతి – భద్రత’ అంశానికి సార్ధకత చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆపరేషన్ సర్చ్‌లైట్ అంటే ఏమిటి?
ఆపరేషన్ సర్చ్‌లైట్ అనేది 1971లో బంగ్లాదేశ్ విమోచన ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యం ప్రారంభించిన సైనిక చర్య. ఈ చర్యలో సుమారు 3 లక్షల బంగ్లాదేశ్ ప్రజలు మరణించారు. అలాగే సుమారు 4 లక్షల మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దాదాపు కోటి మంది బంగ్లాదేశ్ శరణార్థులు భారతదేశానికి వలస వచ్చారు. ఈ ఘటనల ఫలితంగా 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ప్రారంభమైంది. దీని ద్వారా తూర్పు పాకిస్థాన్ విభజించబడి బంగ్లాదేశ్ గా ఏర్పడింది.
Also Read: CM Revanth Reddy: హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే.. పార్టీ పరంగా రిజర్వేషన్లు
మహిళల భద్రతపై చర్చ ఎందుకంటే?
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మహిళల భద్రతకు సంబంధించి చర్చ జరగడం వెనక ఓ కారణముంది. UNSCలో మహిళ కోసం చేసిన ‘1325 తీర్మానం’కి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ చర్చకు అవకాశం కల్పించారు. కాగా, ఈ తీర్మానం 2000లో ఆమోదించబడింది. ఇది యుద్ధ పరిస్థితుల్లో మహిళలు, బాలికలపై జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించే ఉద్దేశంతో ఈ తీర్మానం తీసుకొచ్చారు.
