CM Revanth Reddy: హైకోర్టులో 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే చేయాల్సి అంశాలపైనా కసరత్తు చేస్తుంది. రెండు మార్గాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్లాన్ ఏ ప్రకారం రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో ప్రస్తుతం చేసిన రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లనున్నారు. లేకపోతే ప్లాన్ బీపై సైతం కసరత్తును ప్రారంభించారు. పార్టీపరంగా ఇస్తే ఎలా ఉంటేందని సమాలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
23శాతం రిజర్వేషన్లపైజీవో..
గతంలో కోర్టులు 50శాతం లోబడి రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పును వెలువరించాయి. అయితే ఇప్పుడు తెలంగాణ(Telangana)లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో ఎస్సీ(SC) ఎస్టీ(ST)లకు 25 శాతం అమలుతో రాష్ట్రంలో 67శాతం రిజర్వేషన్లు అవుతున్నాయి. దీంతో 50శాతం రిజర్వేషన్ల బెంచ్ మార్కును దాటుతుంది. అయితే హైకోర్టులో ఈ నెల 8న రిజర్వేషన్లపై విచారణ జరుగుతుండటంతో కోర్టు సైతం 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తే ఎలా ముందుకు పోవాలనేదానిపైనాప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బీసీలకు 23శాతం రిజర్వేషన్లపైజీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆల్ రెడీ యాక్టు ఉండటంతో జీవోతో పంచాయతీ ఎన్నికలు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయానికి సైతం వచ్చినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు సైతం గత రిజర్వేషన్లనే యథావిధిగా అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: MLA Kadiyam Srihari: అభ్యర్థుల ఎంపిక మీదే గెలిపించే బాధ్యత మీదే: కడియం శ్రీహరి
42శాతంపై సీఎం కసరత్తు
బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం సిద్ధమైంది.అందులో భాగంగానే జీవో9ను తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. అయితే హైకోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరుగుతుండటంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే 23శాతం 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం బీసీలు అమలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ పరంగా 19శాతం ఇవ్వాలని సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా 42శాతం బీసీలకు ఇవ్వాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.
ఎన్నికల రీ షెడ్యూల్..
మరోవైపు కోర్టు తీర్పును బట్టి పంచాయతీరాజ్ శాఖ 23శాతం బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకొచ్చేందుకు ముందస్తుగా ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం చేసిన రిజర్వేషన్లను మళ్లీ మార్చి ప్రభుత్వానికి వివరాలను ఇవ్వనున్నారు. ఈ వివరాలను ఎన్నికల కమిషన్ కు సైతం అందజేయనున్నారు. అప్పుడు ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల రీ షెడ్యూల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో పదిపదిహేను రోజులు ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదంతా ఈ నెల 8న హైకోర్టు ఇచ్చే తీర్పుమీదనే ఆధారపడి ఉంటుంది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42శాతం ఒకవైపు చట్టప్రకారం, మరోవైపు పార్టీ పరంగా ఇచ్చేందుకు సంసిద్ధమవుతున్నారు.
Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మహేష్ కుమార్ గౌడ్
