Trump Travel Ban: ఈ ఏడాది జనవరిలో అమెరికా (USA) అధ్యక్షుడిగా రెండవ దఫా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దుందుడుకు నిర్ణయాలు ప్రకటిస్తున్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పు కారణాన్ని చూపుతూ ఏకంగా 12 దేశాలపై ‘ట్రావెల్ బ్యాన్’ (Donald Trump Travel Ban) విధించారు. ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్‌తో పాటు పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పౌరులు అమెరికాకు ప్రయాణించడానికి వీల్లేదని, ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌ను పున:ప్రవేశపెడుతున్నట్టు ఆయన చెప్పారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టుల నుంచి అమెరికాను సురక్షితంగా కాపాడుకునేందుకు ట్రావెల్ బ్యాన్ విధించడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని తన పాలనా యంత్రాంగం ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేస్తోందని ఆయన ప్రస్తావించారు.
Read this, Love Marriage Incident : ప్రేమ పెళ్లి.. పోలీసుల ముందే దాడి!
నిషేధం ఏయే దేశాలపై?
మొత్తం 12 దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సంపూర్ణ ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ (బర్మా), చాధ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్విటోరియల్ గునియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలకు ఉగ్రవాదంతో సంబంధాలు, అమెరికా ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సహకారలేమి, ఆయా దేశాల ఇమ్మిగ్రేషన్ విధానాల్లో లోపాలు ఉండడంతో ఈ దేశాల నుంచి వచ్చేవారితో అమెరికాకు తీవ్రమైన భద్రతా ముప్పు పొంచివుందని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
Read this, Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. బాలికపై లైంగిక దాడి!
ఈ దేశాలపై పాక్షిక ఆంక్షలు
మరో, 7 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ పాక్షిక ఆంక్షలు విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోనీ, టోగో, తుర్కిమెనిస్థాన్, వెనిజులా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీపై పరిమితులు విధిస్తామని తెలిపారు. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్), ఎఫ్ (స్టూడెంట్), ఎం (వొకేషనల్), జే (ఎక్స్చేంజ్) వీసాలను కొద్ది సంఖ్యలో జారీ చేస్తామని ఆయన వివరించారు. ఆయా దేశాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఇన్‌ఫోర్స్‌మెంట్‌కు సరైన రీతిలో సహకరించకపోవడం, ‘హై వీసా ఓవర్‌స్టే’ కారణంగా పాక్షిక ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు.
వైట్‌హౌస్ కీలక ప్రకటన
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘ట్రావెల్ బ్యాన్’పై అధ్యక్ష కార్యాలయం ‘వైట్‌హౌస్’ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన విదేశీ వ్యక్తుల నుంచి అమెరికాను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతసౌధం అభివర్ణించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హామీలను నెరవేర్చుకుంటున్నారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి అబిగిల్ జాక్సన్ చెప్పారు. విదేశీయుల నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని, అమెరికన్ల రక్షణకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని అన్నారు. కాగా, సంపూర్ణ నిషేధం విధించిన దేశాలకు సరైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు లేవని అమెరికా చెబుతోంది. తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read this, RCB Banned from IPL: ప్రాణాలు కంటే సంబురాలే ముఖ్యమా? ఆర్సీబీని బ్యాన్ చేయాలంటున్న నెటిజన్స్