Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. అన్నా, అంకుల్ అని తమను ఆప్యాయంగా పిలిచే బాలిక పట్ల ఇద్దరు కామాంధులు అమానుషంగా ప్రవర్తించారు. వేర్వేరు సందర్భాలలో ఆ బాలిక నిస్సహాయతను అవకాశంగా తీసుకొని లైంగిక దాడికి ఒడిగట్టారు. దళిత మైనర్ బాలికపై దాష్టీకానికి పాల్పడిన ఇద్దరిపై సైదాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మృగంలా ప్రవర్తించిన ఆటో డ్రైవర్
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక (16) ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. తనను ఆటోలో స్కూల్ కు తీసుకెళ్లే వ్యక్తిని బాలిక అంకుల్ అని పిలిచేది. ఎంతో అప్యాయంగా అతడ్ని పలకరిస్తూ ఉండేది. ఇంట్లో మనిషిగా అభిమానించేది. అయితే తను అప్యాయంగా పిలిచే వ్యక్తి లోపల ఓ మృగం ఉందన్న సంగతి ఆ బాలికకు తెలియలేదు. బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్.. బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెను లోబరుచుకొని పలుమార్లు తన నివాసంలోనే లైంగిక దాడి చేశాడు.
Also Read: Tatkal Booking Update: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేలో కొత్త రూల్.. తెలుసుకోకుంటే కష్టమే!
టీవీ చూడటానికి వెళ్లగా అఘాయిత్యం
మరో సందర్భంలో అదే బాలికపై ఇంటికి సమీపంలోని యువకుడు సైతం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నివాసానికి సమీపంలో ఉండే నిందితుడు.. టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన బాలికను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వారి వేధింపులు తట్టుకోలని బాలిక.. ఈ విషయాన్ని కొద్దిరోజుల తర్వాత తండ్రి, ఇతర బంధువులకు తెలియజేసింది. దీంతో వారంతా సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు.. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు.