Tatkal Booking Update: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేలో తత్కాల్ టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కు త్వరలో ఈ- ఆధార్ అథంటికేషన్ (E – aadhaar authentication) ను తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం ద్వారా నిజమైన వినియోగదారులకు కన్ఫామ్ టికెట్లు పొందేందుకు వీలు కలుగుతుందని రైల్వే మంత్రి అన్నారు. అత్యవసర ప్రయాణికులకు ఈ-ఆధార్ ప్రయోగం మంచి ఫలితాలను అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ-ఆధార్ అథంటికేషన్ ఎలా చేస్తారంటే?
తత్కాల్ టికెట్లకు ఈ-ఆధార్ లింకప్ విధానం ఇంకా అమల్లోకి రాలేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన నేపథ్యంలోనే అతి త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ-ఆధార్ అథంటికేషన్ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ తత్కాల్ టికెట్లు కావాల్సిన ప్రయాణికులు.. తమ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేస్తే సరిపోయేది. త్వరలో రానున్న కొత్త విధానంలో ఈ విధానం మారనుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణీకులు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఈ-ఆధార్ ఆధారిత OTP (One Time Password) ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా సదరు ప్రయాణికుడి ఐడెంటినీ గుర్తించినట్లు అవుతుంది. ఈ ప్రక్రియను IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేయవచ్చు.
ఆధార్ తప్పనిసరి చేయడానికి కారణాలు!
తత్కాల్ టికెట్లలో ఈ-ఆధార్ అథంటికేషన్ ను తీసుకురావడం వెనక పలు కారణాలే ఉన్నాయి. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో ఏజెంట్లు, గుర్తింపు లేని ప్రైవేటు టికెట్ బుకింగ్ సంస్థల నుంచి జరిగే మోసాలను నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. చాలా మంది ఏజెంట్లు నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. వాటిని మోసపూరితంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో తత్కాల్ లో ఆధార్ ధృవీకరణ విధానాన్ని తీసుకొస్తే.. ఈ తరహా మోసాలకు చెక్ పెట్టవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. తద్వారా నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు అందేలా చేయవచ్చని నిర్ణయించింది.
Also Read: Youngest Actress: ఆ సీన్లో డైరెక్టర్ యూరిన్ కు వెళ్ళమన్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
ఈ-ఆధార్ లింకప్‌లోని సవాళ్లు!
తత్కాల్ లో కేంద్రం తీసుకురాబోతున్న ఈ – ఆధార్ అథంటికేషన్ విధానం మంచిదే అయినప్పటికీ.. ప్రయాణికులకు కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. తత్కాల్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రయాణికులు పోటీపడుతుంటారు. క్షణాల్లో అవి సేల్ అయిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ ధృవీకరణ విధానం.. టికెట్ల బుకింగ్స్ లో జాప్యానికి కారణం కావొచ్చు. అంతేకాదు మెుబైల్ నెంబర్ కు ఆధార్ లింక్ లేని ప్రయాణికులకు తత్కాల్ ఇక కలగా మారే ఛాన్స్ ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో భారీ ట్రాఫిక్ ఏర్పడి సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదముంది. ఆధార్ డేటా ఉపయోగం వల్ల గోప్యతా సమస్యల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.