Gustavo Petro: వెనిజువెలా (Venezuela crisis) అధ్యక్షుడు నికోలస్ మదురోని (Nicolas Maduro) అగ్రరాజ్యం అమెరికా ప్రత్యేక బలగాలు ఇటీవల మెరుపుదాడి చేసి ఎత్తుకెళ్లిపోయిన విషయం తెలిసిందే. మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని వెనిజువెలా పొరుగు దేశమైన కొలంబియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికాను తప్పుబడుతూ ఇప్పటికే ఎన్నో ప్రకటనలు విడుదల చేసింది. తాజాగా, కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో (Gustavo Petro) స్పందిస్తూ, పెనుసంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చి నన్ను తీసుకుపో పిరికివాడా. నీ కోసం ఇక్కడ ఎదురుచూస్తుంటాను’’ అని డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) గుస్టావో పెట్రో ఛాలెంజ్ విసిరారు. ‘‘తిరిగి ఆయుధం ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నాను. కానీ, మాతృభూమి కోసం మళ్లీ ఆయుధం చేతబడతా’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
రైతులు గెరిల్లా యోధులుగా మారతారు.. జాగ్రత్త
అమెరికా వాళ్లు బాంబులతో దాడి చేస్తే, కొలంబియా చిన్నసన్నకారు రైతులు, కార్మికులు గెరిల్లా యోధులుగా మారిపోతారని హెచ్చరించారు. దేశంలోని అత్యధికులు గౌరవించి, అభిమానించే అధ్యక్షుడిని వాళ్లు అరెస్ట్ చేస్తే ‘ప్రజల జాగ్వార్’ను విడుదల చేసినట్లే అవుతుందని ఆయన గుస్టావో పెట్రో వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా తనను అమెరికా అరెస్ట్ చేయాలనుకుంటే, కొలంబియా ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, లెఫ్టిస్ట్ నాయకుడైన గుస్టావో పెట్రో 1990వ దశకంలో గెరిల్లా దళాల్లో పనిచేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గతేడాది ఆగస్టు నెలలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో కూడా అచ్చం విధంగా డొనాల్డ్ ట్రంప్‌కు సవాలు విసిరారు. ‘‘వచ్చి నన్ను పట్టుకుపో. నీకోసం చూస్తుంటా. ఆలస్యం చేయకు. పిరికివాడా’’ అని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను ట్రంప్ స్వీకరించారంటూ విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.
చర్చలు, పరస్పర గౌరవమే మార్గం
అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొలంబియా విదేశాంగ వ్యవహారాల శాఖ ఆదివారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. చర్చలు, సహకారం, పరస్పర గౌరవం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆమోదయోగ్యంకాని బంధాల విషయంలో మాత్రం ముప్పుని, అలాగే బలగాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటామని హెచ్చరించింది.
రెచ్చగొట్టిన డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికా, కొలంబియా మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కారణంగా కనిపిస్తున్నాయి. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అనంతరం మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, డ్రగ్స్ దందా చేసే వ్యక్తి కొలంబియాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘‘కొలంబియా కూడా బాగా చితికిపోయింది. కొకైన్ తయారు చేసి, అమెరికాకు విక్రయించడాన్ని బాగా ఇష్టపడే వ్యక్తి ఆ దేశాన్ని నడిపిస్తున్నారు. ఇకపై అతడు ఎంతోకాలం కొనసాగించలేడులే. ఇది మాత్రం పక్కా’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కొలంబియా అధ్యక్షుడిపై కూడా ఆపరేషన్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ట్రంప్ నవ్వుతో సమాధానం ఇచ్చారు. మరోవైపు, గతేడాది అక్టోబర్ నెలలో గుస్టావో పెట్రో, ఆయన కుటుంబంపై డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. డ్రగ్స్ అక్రమ వ్యాపారంలో మునిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాగా, కొకైన్ ఉత్పత్తిలో కొలంబియా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రధానంగా పెరూ, బొలీవియా, కొలంబియా దేశాల్లో కోకా మొక్కలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.

