Bhuvanagiri News: తొమ్మిది మాసాలు మోసి కన్న శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే గుళ్ళో వదిలేసి పేగు బంధాన్ని వదిలించుకున్న ఓ కసాయి కన్నతల్లి.. ఒకవైపు, నవజాత శిశువును అక్కున చేర్చుకుని ఆసుపత్రి కి తీసుకెళ్ళి వైద్య చికిత్స చేయించి బిడ్డను నాకు ఇవ్వండి పెంచుకుంటా అంటూ ఓ తల్లి పడ్డ ఆక్రందన.. మరొకవైపు చూపరులను ఆలోచింపజేసి, కంట తడి పెట్టించిన సంఘటన మంగళవారం భువనగిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీబీనగర్(BB Nagar) మండలం పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయం(Sri Linga Bhaveshwara Temple) లో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో అప్పుడే పుట్టి అమ్మ ఆదరణకు నోచుకోని ఓ పసిపాపను ఆలయ పూజారి ఆలయ ప్రాంగణంలో కనుగొని ,గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు.
మెరుగైన వైద్యం కోసం
గ్రామస్తులతో పాటు సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామానికి చెందిన యాకరి సంగీత(Sangeetha), పసికూనను అక్కున చేర్చుకుని అమ్మ లేని లోటును తీర్చింది. పాప పరిస్థితి బాగా లేకపోవడంతో, చలితో కుంచించుకు పోవడంతో తన భర్త పరమేష్(Paramesh), ఆశావర్కర్ బాలమణి(Balamani) సాయంతో పాపను బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళింది. ఆసుపత్రి సిబ్బంది పాప బొడ్డు పేగు, మాయను తొలగించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రికి పంపించారు. జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు పాపకు చికిత్స చేసారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి, బాలల సంరక్షణ కమిటీల ఆదేశానుసారం పసి పాపకు మెరుగైన వైద్యం అందించడానికి హైదరాబాద్(Hyderabad) నీలోఫర్ ఆసుపత్రి(Niloufer Hospital) కి పంపించారు. పిల్లలు లేని తనకు దేవుని గుళ్ళో పసి పాప దొరికిందని, ఆ పాపను పెంచుకుంటా, ఇప్పించండి అంటూ యాకరి సంగీత(Sangetha) అధికారులను, డాక్టర్లను ప్రాధేయపడింది. చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని, తమ వంతు సాయం అందిస్తామని అధికారులు సంగీతకు నచ్చజెప్పారు.
భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవజాత శిశువులను వదిలి వేయడం, చనిపోయిన శిశువులను దహణం చేయకుండా పారేయడం లాంటి పైశాచిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్(Kodare Venkatesh)డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసి పాపను, ప్రాణాలు కాపాడిన పడమటి సోమారం గ్రామానికి చెందిన యాకరి సంగీత పరమేష్ దంపతులను, ఆశావర్కర్ బాలమణి లను ఆయన అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఆస్పత్రిలో “సర్కారు ఊయల” ను, అలాగే జిల్లా లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో “సర్కారు ఊయల” ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Gongidi Sunitha: మేము కన్నెర్ర చేస్తే గ్రామాల్లో తిరగలేవు జాగ్రత్త: గొంగిడి సునీత ఫైర్..!

