Blast in Match: ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామమైన పాకిస్థాన్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. వాయువ్య పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లో పేలుడు (Blast in Match ) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ పేలుడు జరిగింది. ఐఈడీని (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ధృవీకరించారు.
గాయపడినవారిలో పిల్లలు కూడా ఉన్నారని, గాయాలపాలైనవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిపిందేనని అనుమానం వ్యక్తం చేశారు. లక్షిత దాడిగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అనుమానిత మిలిటెంట్లు స్థానిక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి యత్నించినట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ ప్రయత్నం విఫలమైందని తెలిపాయి.
కాగా, పాకిస్థాన్‌లో క్రికెట్ మైదానాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరపడం ఇదే తొలిసారి కాదు. కొన్ని ముఖ్యమై ఘటనలను పరిశీలిస్తే, 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు మీద లాహోర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ ఏడాది మార్చి 3న, గడాఫీ స్టేడియానికి ఆటగాళ్లు బస్సుపై బయలుదేరగా, ఉగ్రవాదులు ఆ బస్సుపై కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఐదుగురు ప్లేయర్లకు స్వల్ప గాయాలయ్యాయి. నాటి కెప్టెన్ మహేల జయవర్ధనే, వైస్ కుమార సంగక్కర, అజంతా మెండిస్, థిలాన్ సమరవీర, తరంగ పరవితరణ వంటి ఆటగాళ్లు ఈ దాడిలో గాయపడ్డారు.
పాకిస్థాన్-జింబాబ్వే వన్డే మ్యాచ్ లక్ష్యంగా కూడా ఉగ్రదాడి జరిగింది. గడాఫీ స్టేడియానికి వెలుపల ఈ ఘటన జరిగింది. అంతేకాదు, 2023లో క్వెట్టాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ సమీపంలో పేలుడు సంభవించింది. నవాబ్ అక్బర్ స్టేడియానికి అతి సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ప్రముఖ క్రికెటర్లు బాబర్ అజామ్, షాహిద్ అఫ్రిదీలను తక్షణమే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ దాడికి టీటీపీ (Tehreek-e-Taliban Pakistan) బాధ్యత వహించింది.
Read Also- Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు