Ganesh Immersion 2025: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనం(Ganesh Immersion) ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పకడ్బందీ గా బందోబస్తు చేపట్టిన పోలీసు శాఖ గగన తలం నుంచి నిఘా పెట్టింది. ప్రధాన నిమజ్జనం రూట్లు అయిన బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 కిలోమీటర్లు, ఖైరతాబాద్ బడా గణపయ్య మండపం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లతో పాటు దాదాపు 303 కిలోమీటర్ల గణేశ్ శోభయాత్ర జరిగే రూట్లలో మండపాల కదలిక, ట్రాఫిక్ వంటి అంశాలను శనివారం హైదరాబాద్ జిల్లా(Hyderabad District) ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్,(DGP Jitender) హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నగర పోలీసు కమిషనర్ సీసీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లు సాయంత్రం అయిదు గంటల సమయంలో చాపర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
Also Read: Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
ఏరియల్ సర్వే
ముఖ్యంగా పాతబస్తీ నుంచి హుస్సేన్ సాగర్ వరకున్న ప్రధాన నిమజ్జన రూట్ లో మండపాల సంఖ్య, ట్రాఫిక్ మళ్లింపులను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఇతర వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఉదయం నుంచి పలు సార్లు డీజీపీ జితేందర్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. సాయంత్రం అయిదు గంటల సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాపర్ లో ఏరియల్ సర్వే నిర్వహించిన జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నిమజ్జనం వేగంగా జరిగేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు సహకరించిన మండప నిర్వాహకులకు, ప్రతి ఒక్కరికి హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఊహించిన విధంగానే భారీ ఏర్పాట్లు, బందోబస్తు మధ్య గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని, నిమజ్జన ప్రక్రియను శనివారం రాత్రి పన్నెండు గంటల లోపు పూర్తి చేసేలా పోలీసులు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మండప నిర్వాహకులు గణనాధులను త్వరగా నిమజ్జనానికి తరలించేలా ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Also Read: Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్ రావు