Khammam ashram school: తండ్రి లేని తొమ్మిదో తరగతి చదివే బాలికకు 24 గంటల కడుపునొప్పి రావడంతో కూలి చేసి పిల్లల్ని పోషిస్తున్న తల్లి తన కూతురుకు ఆపరేషన్ చేయించింది. వైద్యుల సూచన మేరకు పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తల్లి కూతురును ఆశ్రమ పాఠశాలకు పంపింది. మూడు రోజులు పాఠశాలలో గడిపిన తరువాత ఓ రోజు రాత్రి పక్కనే పడుకునే తన స్నేహితురాలు నద్రలో కాలు మీద వేయడంతో ఆపరేషన్ చేసిన చోట కాలు తగిలి బాలికకు నొప్పిగా అనిపించింది.
నిద్రలో నా స్నేహితురాలు కాలు వేయడం వల్ల నాకు నొప్పిగా ఉంది అని విషయం ఆశ్రమ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి బాలిక చెప్పింది. మీలాంటి వారి వల్ల మాకు సమస్యలు వస్తాయి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని నేను భరించలేనని హెడ్మాస్టర్ కోపోద్రిక్తులయ్యారు. నువ్వు స్కూల్లో ఉండటానికి వీల్లేదని కేకలు వేస్తూ బలవంతంగా టీసీ ఇప్పించారు. బాలిక కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ వేళ్ళ పడ్డా గాని ఏమాత్రం కనికరించలేదు. ఇలా అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది..
ఇక్కడే చదవాలని ఉందని చెప్పినా కనికరించలేదు.
కామేపల్లి మండలం మున్సిఫ్ బంజర గ్రామానికి చెందిన నిత్యశ్రీ అనే గిరిజన బాలిక ఈ ఏడాది జూన్ నెలలో మేకల తండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి లో చేరింది. కొన్ని రోజుల తర్వాత అపెండిసైటిస్ ఆపరేషన్ జరగడంతో బాలిక కొద్ది రోజులు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి పాఠశాలకు వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనకు తల్లి కూతుళ్లు ఇద్దరు ఎంత ప్రాధేయపడ్డా ఏమాత్రం మానవత్వం లేకుండా బాలికను బడిలో నుంచి టీసీ ఇచ్చి పంపారు. ఇంటిదగ్గర చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ఆశ్రమ స్కూల్లోనే ఉండి చదువుకోవాలని నిత్యశ్రీ ఎంత ఏడ్చి ప్రాధేయపడ్డా కానీ హెడ్మాస్టర్ ఏ మాత్రం కనికరించలేదు.
ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారు.
బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ ఆశ్రమ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నా మానవత్వం లేని ఇలాంటి నిర్వాహకుల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు కారుతోంది. బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆశ్రమ స్కూల్లో చదివే వారికి ఆరోగ్య భద్రత కూడా కల్పిస్తూ విద్యార్థులు అనారోగ్య పాలైతే వారికి ఆసుపత్రి ఖర్చులు కూడా భరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా నిర్వాహకులు మాత్రం మనకెందుకులే అని అనారోగ్యానికి గురైన పిల్లలను తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు. నిత్యశ్రీ కుటుంబం కడు పేదరికంలో ఉన్న కూతురు ను ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించింది. తిరిగి వచ్చిన తర్వాత ఆ బాలిక బాగోగులు చూడలేక బయటికి గెంటేసారంటే ఇక్కడ విద్యార్థులను పట్ల నిర్వాహకుల శ్రద్ధ ఏ విధంగా ఉందో స్పష్టమవుతుంది. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆశ్రమ స్కూల్లోనే చదువుకోవాలని తపిస్తున్న నిత్యశ్రీ కి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మేకలతండా ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని వివరణ కోరగా…
ఈవిషయంపై ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణను స్వేచ్ఛ ప్రతినిధి వివరణ కోరగా నిత్యశ్రీ ఆరోగ్యం బాగాలేక తన తల్లి టి సి ఇవ్వమంటే ఇచ్చామని తెలిపారు