Internal Challenges Are The Biggest Task : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పటివరకు పాలనాపరంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్స్ కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత కరెంట్ లాంటి గ్యారెంటీల అమలు పట్ల ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలనే నిర్ణయంతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వాలనే నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారు.
ఇప్పటిదాకా అంతా సాఫీగా సాగినా, రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేక అంతర్గత పాలనా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెతకటం, ఆర్థిక అప్పులు, బకాయిల భారం నుండి రాష్ట్రాన్ని బయటపడేయటం అంత తేలికైన విషయం కాదు. మరీ ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వంపై విమర్శలు వచ్చి రైతుల సైడ్ నుంచి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ పనుల విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వటం ఆపివేయటం వలన ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు 98 వేల ఎకరాల స్థిరీకరణ ప్రమాదంలో పడితే ప్రభుత్వంపై విమర్శలు చేయటానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో నీళ్లు లేక 10 లక్షల ఎకరాల వరి పంట ఎండిపోయిందనే వార్తలు వస్తున్నాయి. నీళ్లు రావటం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఛాయలు కూడా కనపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు ఎలా ఉన్నా ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేసిన 98 వేల కోట్ల రూపాయల అప్పుకి ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి ప్రాజెక్టులో జరిగిన అవినీతి, దుర్వినియోగం, నాణ్యతా లోపం ఎంత ప్రాధాన్యత గాల అంశాలో రైతాంగానికి సాగునీరు అందించడం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం గమనించాలి.
Read Also : లౌక్యమే కాదు.. దూకుడు కావాలి
ఇలాంటి సున్నిత విషయంలో సర్కారు బేషజాలకు పోకుండా రైతుల కోసం ఎంత నష్టమైనా ప్రభుత్వమే భరిస్తుందనే భరోసా కల్పించాలి. అలాగే, రైతుబంధు లాంటి పథకం విషయంలో ప్రభుత్వం సహేతుకమైన నిర్ణయం తీసుకొని నిజమైన సాగుదారులకి మరింత సమర్థవంతంగా పెట్టుబడి సహాయం అందించాలి. రైతుబంధు సహాయం విషయంలో కొత్త ప్రభుత్వం పైన కొంతమేరకు రైతులలో అసంతృప్తి కలుగుతున్న మాట వాస్తవం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర సహాయం ద్వారా త్వరగా పూర్తిచేసి రైతాంగానికి అందుబాటులోకి తేవాలి. ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా రుణమాఫీ విషయంలో కూడా రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
పేద గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, జీరో బిల్లులు అందించే విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించిందో అలాగే విద్యుత్ సరఫరా విషయంలో కూడా ముఖ్యంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేసి భవిష్యత్తులో రాష్ట్రానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలి. విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలను నష్టాల ఊబి నుండి బయటపడేయటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం మాదిరిగా జరగకుండా చూసుకోవాలి. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు లాంటి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ లాంటి అనైతిక చర్యలకు పాల్పడటం డిపార్ట్‌మెంట్‌లో అవినీతి వేళ్లూనుకున్నదని రుజువైంది. అలాగే, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఏ ఎంఆర్ఓ పైన దర్యాప్తు చేసినా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము బయటపడుతుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
Read Also : అవినీతి కట్టప్పల ఆట కట్టడెప్పుడో?
కాబట్టి అవినీతి రహిత పాలన అందించటం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలి. వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను క్రమం తప్పకుండా వేగంగా భర్తీ చేయడానికి చర్యలు చేపట్టడంతో పాటు విద్యా ఆరోగ్య రంగాలను ప్రక్షాళన చేసి ఈ రెండు రంగాలలో విభిన్నమైన వాస్తవ ఫలితాలను రాబట్టగలిగితే ప్రజలలో ప్రభుత్వంపై మరింత విశ్వాసం, నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. పాలనలో అక్కడక్కడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు ముఖ్యమంత్రి తక్షణం స్పందిస్తున్న తీరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ప్రజలకి నమ్మకం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలు పరీక్ష ఉంటుంది. ఎలా ముందుకెళ్తుంది, తీసుకునే నిర్ణయాలు ప్రగతి పాలన, ప్రజా పాలనకు అద్దం పడతాయి.
-డాక్టర్ తిరునహరి శేషు (అసిస్టెంట్ ప్రొఫెసర్) కాకతీయ విశ్వవిద్యాలయం