When Is The Game Of Corruption Cut Off : అవినీతి, కపటత్వం అనేవి ప్రజాస్వామ్యపు అనివార్య ఉత్పత్తులు కారాదని జాతిపిత మహాత్మాగాంధీ ఏనాడో సూచించారు. కానీ, నేడు మన దేశంలో అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. నీతికి కట్టుబడ్డవారు సమాజం దృష్టిలో చేతకానివారిగా మిగిలిపోతున్నారు. ‘ఆ అధికారి డబ్బులు తీసుకున్నా పని మాత్రం అనుకున్నట్లుగా చేసి పెడతాడు’ అనే స్థాయికి మన సమాజం నేడు చేరుకుంది. అవినీతికి పాల్పడిన నేతల ప్రస్తావన వచ్చినప్పుడు జనం ‘ఈ రోజుల్లో అవినీతి చేయని వాడెవరో చెప్పండి’ అంటూ అందరూ ఆ తాను ముక్కలేనని చెప్పుకొస్తున్నారు. అలాగని వారంతా అవినీతి సమర్థకులేమీ కాదు. కాకపోతే.. ఎన్నికల రోజు కామ్‌గా తమ ఓటుతో అవినీతి పరులను పదవి నుంచి తప్పించి సంతోష పడుతున్నారు తప్ప ‘ఇదేం పద్ధతి’ అని బహిరంగంగా నిలదీయలేకపోతున్నారు. తాజాగా తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ట్వీట్ కూడా కాస్త అటుఇటుగా ఈ ముచ్చటే చెబుతోంది.
డైనమిక్ పోలీసు అధికారిగా పేరొందిన ఆనంద్ ఏ పదవిలో ఉన్నా, నిత్యం సోషల్ మీడియాలో ఆయా సమస్యల మీద తన అభిప్రాయాలను సామాన్యులతో పంచుకుంటున్నారు. తెలంగాణలో ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్, రవాణాశాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ‘ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతూ పట్టుబడిన తోటి ప్రభుత్వ ఉద్యోగులను జైలుకు పంపే బాధ్యతల్లో ఉండటం నిజంగా నాకు ఇబ్బందిగా ఉంది. అదే సమయంలో లంచాలకు దూరంగా ఉంటూ, సామాన్యులకు బాధ్యతగా సేవలందించాలని తెలంగాణ ప్రభుత్వం తన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలివ్వటం కొంత ఊరటగా ఉంది. ఇకనైనా ఈ జాడ్యం తగ్గుతుందని భావిస్తున్నా’ అంటూ తాజాగా ఆయన చేసిన ట్వీట్‌లో తన మనసులోని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో కాస్త అసంతృప్తి కనిపించినా, నెటిజన్లు మాత్రం ఆయన అభిప్రాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Read Also : కేజ్రీ.. ఎటు నుంచి ఎటు వైపు..!
నిజానికి అవినీతి జాడ్యం దేశ కాలమాన పరిస్థితులకు అతీతంగా మానవ జీవితంలో భాగమైపోయింది. నిజానికి అవినీతిని నిర్వచించడం చాలా సులభం. దాని అర్థాన్ని లేదా ఫలితాన్ని అర్థం చేసుకోవడమూ సులభమే. కానీ మూసివేసిన తలుపుల వెనుక జరిగే అవినీతిని గుర్తించటం, వివరించటం.. మరీ ముఖ్యంగా దానిని ఆధారాలతో నిరూపించటం మాత్రం చాలా కష్టం. ఇది ఒక చట్టం, శిక్ష వల్లనో దూరమవుతుందనీ చెప్పటం కష్టమే. మనిషి అనైతికత నుంచి పుట్టిన ఈ జాడ్యాన్ని వ్యక్తి నిర్మాణం, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకతను పెంచటం ద్వారానే అరికట్టగలమని మేధావులు చెబుతున్నా అది నేటికీ అందని కలగానే మిగిలిపోతోంది. 2024 ఫిబ్రవరిలో విడుదలైన ప్రపంచ అవినీతి సూచికలో మన దేశం 93వ స్థానంలో నిలిచింది. మొత్తం 180 దేశాల్లో చేపట్టిన పరిశోధనలో సోమాలియా, సిరియా, యెమెన్‌లు అత్యంత అవినీతి గల దేశాలుగా నిలవగా, డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ దేశాలు అతితక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గతంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ ఈ రెండు రాష్ట్రాల్లోని 20,200 మందితో మాట్లాడి చేపట్టిన సర్వేలో ఆశ్చర్యపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లంచం ఇవ్వనిదే ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ పని జరగదని నూటికి 55 శాతం మంది అభిప్రాయపడగా, అధికారుల్లో కేవలం 20 శాతం మందే నిజాయితీ పరులనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది తమను కనీసం పట్టించుకోవటం లేదని 38.4 శాతం చెప్పగా, దురుసుగా మాట్లాడుతున్నారని 21.3 శాతం చెప్పారు. 23 ప్రభుత్వ కార్యాలయాల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్ శాఖల్లో అవినీతి పరంగా తొలి నాలుగు స్థానాల్లో ఉంటాయని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని బ్రోకర్ల వ్యవస్థ వల్ల అవినీతి వ్యవస్థీకృతమైందని, అక్కడ పనిచేసే వారంతా అందులో భాగస్వాములుగా మారక తప్పని పరిస్థితి ఏర్పడి పోయిందని 50 శాతం తెలిపారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు తమకు దానిపై నమ్మకం లేదని 60 శాతం మంది బదులిచ్చారు.
నిజం చెప్పాలంటే మన దేశంలో సామాన్యుడి పుట్టుకే లంచంతో మొదలవుతుంది. ప్రభుత్వాసుపత్రిలో ఉన్నంతలో మెరుగయిన వాతావరణంలో కాన్పు జరగాలంటే చేయితడపక తప్పని పరిస్థితి. అడుగడుగునా అవినీతి నేతలు రాజ్యమేలే ఈ దేశంలో అప్పుడప్పుడూ కనిపించే అన్నా హజారే వంటి వారు మాట్లాడే మాటలకు అంత ప్రాధాన్యం లభిస్తోంది. హజారే 2012లో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆయనకు నేటి గాంధీ అనే పేరు తెచ్చిన సంగతీ తెలిసిందే. ఆయన అడుగుజాడల్లో నడుస్తానంటూ వచ్చి నేడు అవినీతి కేసులో ఈడీ విచారణలో ఉన్న కేజ్రీవాల్ అందుకు భిన్నమైన పాత్రలో కనిపించటం నిరాశ కలిగించే విషయమే. అనేక పార్టీల వ్యవస్థల ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో ఏ అంశం మీదైనైనా చట్టం చేయాలంటే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేని కారణంగా గత 77 ఏళ్లలో అవినీతి విశ్వరూపం దాల్చే దశకు చేరింది. అవినీతికి మారుపేరుగా నిలిచిన లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, సుఖ్‌రామ్, బంగారు లక్ష్మణ్, ఎ.రాజా, కనిమొళి మొదలు నేటి కేజ్రీవాల్ వరకు అందరూ ఆ తానులో ముక్కలుగా నిలిచారు. ‘అవినీతి అనేది చాలా కామన్’ అనేంతగా నేటి సమాజంలో ఒక భావన ఏర్పడిందంటే దాన్ని తొలగించే మార్గమే లేదని జనం భావిస్తున్నారనే అనుకోవాల్సి వస్తోంది.
Read Also : గ్యారెంటీలతో కాంగ్రెస్ గెలుపు ధీమా..!
అవినీతిపై పోరు సుమారు రెండు శతాబ్దాల నాడే పశ్చిమ దేశాల్లో మొదలైంది. క్రీ.శ 1713 నుండి రాచరిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థల్లోని అవినీతిని నిర్మూలించేందుకు ‘చాన్సలర్ ఆఫ్ జస్టిస్’ పేరుతో ఆ వ్యవస్థ పలు దేశాల్లో అమల్లో ఉండేది. 1809లో స్వీడన్‌లో ‘అంబుడ్స్‌మన్’ పేరుతో ఈ వ్యవస్థ మొదలుకాగా, 1919లో ఫిన్లాండ్, 1962లో న్యూజిలాండ్, 1966లో మారిషస్, గయానా, 1967లో బ్రిటన్, 1976లో ఆస్ట్రేలియాలో అంబుడ్స్‌మన్ వ్యవస్థలు ప్రారంభమయ్యాయి. ఇపుడు ప్రపంచంలో 80కి పైగా దేశాల్లో ఈ వ్యవస్థ అమలులో ఉంది. మనదేశంలో అనేక పోరాటాల తర్వాత లోక్‌పాల్ బిల్లు చట్టంగా మారినా, దాని ఫలితాలు నేటికీ ప్రజలకు అందటం లేదు. మరోవైపు తెలంగాణలో గత పదేళ్ల కాలంలో అవినీతి సార్వజనీనమైపోయింది. అయితే.. మూడు నెలల నాడు ప్రభుత్వం మారిన తర్వాత ఇన్నేళ్లుగా మౌనంగా ఉండిపోయిన ఏసీబీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఇది కొత్త ముచ్చటో లేదా నిజంగా అవినీతి అధికారుల భరతం పట్టాలన్న ప్రభుత్వ సంకల్పమో గానీ, గత ఫిబ్రవరి నెలలలోనే ఏకంగా ఎనిమిది మంది పెద్ద అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. అంతకుముందు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బినామీల పేరిట భూములు, విల్లాలు రాయించి వందల కోట్లకు పడగలెత్తిన శివబాలకృష్ణ వ్యవహారంలో అనేకమంది నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లుగానూ ఏసీబీ అధికారులు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అటు ప్రభుత్వం కూడా అవినీతి విషయంలో కాస్త కటువైన ప్రకటనలు చేస్తోంది గానీ, ఆ ప్రకటనలు ఫలితాలను ఇవ్వగలిగితేనే ఒక సానుకూల మార్పు మొదలైందనే భావన నిజంగా కలుగుతుంది. అది గత పదేళ్లుగా గాయపడిన తెలంగాణ సమాజానికి గొప్ప ఊరటగానూ నిలుస్తుంది.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)