Not Only Secular, Aggressive : కార్యసాధన విషయంలో సమయం, సందర్భాన్ని బట్టి లౌక్యం ఎంత అవసరమో, అవసరమైనప్పడు మొండితనం కూడా అవసరమనేది పెద్దలు చెప్పేమాట. నిజ జీవితంలో ఇదెంత నిజమో, రాజకీయాల్లో ఇది అంతకంటే కాస్త ఎక్కువ నిజం. అందునా.. బలవంతుడైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఇది ఒక అనివార్యత కూడా. గత పదేళ్లుగా తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, రచించిన వ్యూహాలను పరిశీలిస్తే, తెలంగాణ విషయంలో కేంద్రం చెప్పినదంతా మాటలకే పరిమితమని అర్థమవుతుంది. 2014 నుంచి కేంద్రప్రభుత్వం, బీజేపీయేత పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు.. బాగా అవగాహన చేసుకుని, అభివృద్ధి విషయంలో కేంద్రంతో వ్యవహరించాల్సిన వైఖరి విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉంది.
గత పదేళ్లుగా తెలంగాణకు ఏటా కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన నిధులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందాల్సిన మొత్తాల మీద గత పదేళ్లుగా కేంద్ర పెద్దలు ఏదో ఒక వంకతో ఎంతోకొంత కొర్రీలు పెడుతూనే వచ్చారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన రూ. 41,259 కోట్లలో కేంద్రం కేవలం 11% నిధులు అందించి చేతులు దులుపుకుంది. 14వ ఫైనాన్స్ కమిషన్ సూచించిన విధంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు అందాల్సిన రూ. 817 కోట్ల గురించి ఏ సమాధానమూ కేంద్రం నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం కింద నాడు తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు నేటికీ జరగలేదు. ఆ చట్టంలోని 94(2) సెక్షన్ ప్రకారం, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్ల ముచ్చటను కేంద్రం సౌకర్యవంతంగా మరచిపోయింది. మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ.2,350 కోట్లు, వివిధ రంగాల అభివృద్ధికి రూ. 3,024 కోట్లు, 2020-21 ఏడాదికి సంబంధించి తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు అందిన పన్నుల్లో, తిరిగి తెలంగాణకు దక్కాల్సిన రూ. 723 కోట్ల బకాయిని కేంద్రమే చెల్లించాలని, చెరువుల పునరుద్ధరణ కోసం రూ.5 వేల కోట్లు సాయం చేయాలని ఆర్థిక సంఘం చెప్పిన మాటలు చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందాన మారాయి. పునర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా వంటివి ఎప్పుడో కేంద్రం అటకెక్కించేసింది. తెలంగాణకే ఐటీఐఆర్ అని నమ్మబలికి ఆనక దానిని దక్కకుండా చేసింది.
Read Also : అవినీతి కట్టప్పల ఆట కట్టడెప్పుడో?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగానే వ్యవహరిస్తూ, న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిని అందిపుచ్చుకుంటామని ప్రకటించి ఒక మంచి సంప్రదాయానికి బాటలు పరిచారు. గతంలో కేసీఆర్ బీజేపీతో రాజకీయంగా విభేదించి కేంద్రాన్ని ఏదీ అడగకుండా బెట్టు చేయటంతో వేల కోట్ల రూపాయాల నిధులు తెలంగాణకు దక్కకుండా పోయాయి. దీనికి భిన్నంగా సీఎం రేవంత్ తొలిసారి ప్రధానిని కలిసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన డజనుకు పైగా సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, కొత్త ఐఏఎస్‌ల కేటాయింపు, ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు, జాతీయ రహదారుల వంటి డజనుకు పైగా అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ రావటమూ జరిగింది. అయితే, ఇదే రకమైన ధోరణిని కేంద్రం భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వంతో అవలంబిస్తుందని పూర్తిగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. దీనికి ఆయా ప్రభుత్వాలతో కేంద్రం అవలంబిస్తున్న విధానాలు మన కళ్లముందు కనబడుతున్నాయి.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట కేంద్రం తొలుత ఆర్థిక సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రాష్ట్రాలకు జీఎస్టీ వాటాలు నిర్ణయించే జిఎస్‌టి కౌన్సిల్ కేంద్రం ఆధ్వ ర్యంలో నడుస్తుంది. పైగా హక్కుగా రావాల్సిన నిధుల జీఎస్టీ నిధుల గురించి రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్దించవలసి వస్తున్నది. పైగా అమ్మకం పన్ను వాటా రాష్ట్రాలకు ఎగగొట్టేందుకు మోదీ సర్కారు అమ్మకం పన్నుకు ప్రత్యామ్నాయంగా సెస్‌ను విధించడం మొదలుపెట్టింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రాలకు కేవలం మూడే మూడు వస్తువులపైన తప్ప తక్కిన వేటిపైనా పన్ను విధించే అధికారం లేకుండా పోయింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు వంటిది. ఇక గవర్నర్ ద్వారా కీలక అంశాల విషయంలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయటమనే వ్యూహాన్నీ కేంద్రం ఇతర పార్టీల ప్రభుత్వాలున్న చోట అమలు చేస్తోంది. ఇదేంటని ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ‘అవినీతి’ అనే సమాంతర ప్రచారం మొదలు పెట్టి ప్రజల్లో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రతి రాష్ట్రానికీ దానిదైన సొంత భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆహారపుటలవాట్లు, జీవన విధానం ఉంటుంది. అలాగే వనరుల పరంగా కొన్ని పరిమితులూ ఉంటాయి. కానీ, కేంద్రంలోని ప్రభుత్వం ఒకే భాష, ఒకే దేశం, ఒకే చట్టం అంటూ అన్నింటినీ ఒకే చట్రంలో ఇమిడ్చే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ వేడిని రగిల్చేందుకు జాతీయవాదాన్ని చర్చలో ఉంచుతూ, ప్రాంతీయ అస్తిత్వాలను బలహీన పరుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న ప్రభుత్వాల నేతల మీద బూటకపు కేసులు పెట్టి వారి ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
Read Also : కేజ్రీ.. ఎటు నుంచి ఎటు వైపు..!
కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కేంద్రంతో సఖ్యత కోరటం మంచిదే. కానీ, భవిష్యత్తులో కేంద్రం తెలంగాణకు న్యాయంగా అందించాల్సిన సాయం విషయంలో వివక్ష ప్రదర్శించినా, మన హక్కులను కాలరాస్తూ సమాఖ్య వ్యవస్థను నీరు గార్చే ప్రయత్నం చేసినా దానిని తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కర్ణాటక విషయంలో కేంద్రం వైఖరిపై గతంలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన విషయాన్ని, సమాఖ్య వ్యవస్థ బలోపేతం, లౌకికత్వ పరిరక్షణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీలో గళమెత్తిన సంగతినీ, దానికి తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ గొంతుకలిపిన ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి గమనంలోకి తీసుకోవాల్సిన అవసరముంది.
కేంద్రంతో ఘర్షణ వైఖరిని చేపడితే.. పనులు కావనే స్టాండ్ తీసుకున్న నాటి కేసీఆర్ వ్యవహారశైలి కారణంగా చాలా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాటన పెట్టే భాధ్యతను భుజాలకెత్తుకున్న రేవంత్ రెడ్డి, అవసరమైన సందర్భాల్లో గట్టిగా కేంద్రాన్ని నిలదీయటానికి సిద్ధపడాలి. అలాగే, ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోతూ, పారదర్శకమైన, సుస్థిరమైన పాలనను అందించి, గాయపడిన తెలంగాణకు తిరిగి ప్రగతి బాటన పరుగులెత్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
–షేక్ అబ్దుల్ సమ్మద్ (పాత్రికేయుడు)