GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తించే శానిటేషన్ సిబ్బంది పని తీరు జీహెచ్ఎంసీ జీతం, రాంకీకి ఊడిగం అన్నట్టు తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్త సేకరణతో పాటు డంపింగ్ యార్డుకు తరలించే అన్నిరకాల బాధ్యతల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి రాంకీ సంస్థ వ్యవహారిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం గ్రేటర్ లో ప్రతి రోజు పోగయ్యే చెత్త టన్నుకు రూ.800 బల్దియానే చెల్లించాలన్న ఒప్పందం చేసుకున్న రాంకీ ఇపుడు ఒక టన్ను చెత్తకు సుమారు రూ.2 వేలను జీహెచ్ఎంసీ చెల్లిస్తున్నా, రాంకీ సంస్థ నేటికీ జీహెచ్ఎంసీకి చెందిన మ్యాన్ పవర్, మిషనరీలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా జీహెచ్ఎంసీలో చెత్త విధులను నిర్వర్తించే మెడికల్ ఆఫీసర్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారుల వరకు రాంకీ నెలసరి ఇంటెన్సివ్ లు చెల్లిస్తున్నందున, అధికారులు చెత్త సేకరణ, ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలింపు వంటి ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలంటూ కార్మికులు, ఉద్యోగులపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాంకీ ప్రలోభాలకు తలోగ్గుతున్న జీహెచ్ఎంసీ అధికారులు జీతం జీహెచ్ఎంసీ నుంచి తీసుకుని రాంకీకి ఊడిగం చేస్తున్నారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అమ్యామ్యాలకు అలవాటు పడిన జీహెచ్ఎంసీ శానిటేషన్ ఉద్యోగులు కొందరు ఇక్కడ రిటైర్డు అయిన తర్వాత రాంకీలో చేరి విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
13 ఏళ్లయినా, ఒక్కసారి కూడా సమీక్ష లేదు
గ్రేటర్ వ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో రాంకీ కో ఆర్డినేటర్లుగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్న సంస్థ, వారికి సైతం అరకొర జీతాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి తోడు చెత్త వాహానాల డ్రైవర్లు సైతం సకాలంలో జీతాలందక, పలు సార్లు ఆందోళనలు చేపట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ రకంగా రోజురోజుకి జీహెచ్ఎంసీలో రాంకీ అక్రమాలు, అవకతవకలు పెరిగిపోతున్నా, కనీసం ప్రశ్నించే వారే కరవయ్యారు. ఒప్పందం జరిగి ఏకంగా 13 ఏళ్లు గడిచినా, ఇప్పటి వరకు ఎనిమిది, తొమ్మిది మంది కమిషనర్లు మారినా, రాంకీ పనితీరుపై ఇప్పటి వరకు ఒక్కసారైనా సమీక్షించిన దాఖలాల్లేవు. సకాలంలో చెత్త సేకరణ, తరలింపు వంటివి జరగని పక్షంలో రాంకీకి అధికారులు నామమాత్రంగానే జరిమానాలు విధిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.
Also Read: Hydra: బడా బాబులకు బిగ్ షాక్.. ఆక్రమణలకు పాల్పడితే ఆస్తులు జప్తు!
నిర్వీర్యమయ్యే దిశగా డోర్ టూ డోర్ చెత్త సేకరణ
హైదరాబాద్ మహానగరాన్ని డంపర్ బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా జీహెచ్ఎంసీ 2015 నుంచి దశల వారీగా సుమారు 3750 స్వచ్చ ఆటో టిప్పర్లను సమకూర్చుకుంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అపుడున్న 22 లక్షల గృహా సముదాయాలను డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ కోసం 3750 స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు కేటాయించారు. వీటిలో ప్రస్తుతం దాదాపు1800 స్వచ్ఛఆటో టిప్పర్లు కన్పించకుండా పోగా, మరి కొన్ని ఇతర జిల్లాల్లో దర్శనమిచ్చిన ఘటనలు తెలిసిందే. అంతంతమాత్రంగా ఉన్న స్వచ్ఛ ఆటో టిప్పర్లు డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ ను డైలీ చేయలేకపోతున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి.
డోర్ టూ డోర్ చెత్త సేకరించే కార్మికుడికి ఇంటి యజమానులు నెలకు రూ.50 చెల్లించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేయగా, ఇపుడు కార్మికులు డిమాండ్ చేసి మరీ ఒక్కో ఇంటి నుంచి రూ.500 నుంచి రూ. వెయ్యి, ఒక్కో అపార్ట్ మెంట్ నుంచి నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తూ, నెలకు తక్కువగా రూ. వంద నుంచి రూ.500 చెల్లించే ఇండ్ల నుంచి చెత్తను సేకరించటం లేదని తెల్సింది. దీనికి తోడు గతంలో చెత్తకుండీలు, డంపర్ బిన్లు ఉన్న చోట పోగయ్యే చెత్తను కూడా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులే సేకరించి, ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలించాలని మెడికల్ ఆఫీసర్లు వత్తిడి చేస్తుండటంతో డోర్ టూ డోర్ చెత్త సేకరణ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది.
Also Read: Miss World 2025: దేశంలోనే సేఫేస్ట్ సిటీగా హైదరాబాద్..