Hydra: సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు పాల్పడే వారికి ఇక మున్ముందు హైడ్రా బిగ్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు కేవలం చెరువులు, కుంటలు, నాలాలా ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించటంతో పాటు బాధ్యులపై గ్రేటర్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో కేసులు నమోదు చేయించిన హైడ్రా ఇపుడు కేసుల దర్యాప్తును ముమ్మరం చేసేందుకు రంగం సిద్దం చేసింది. రెండు రోజుల క్రితం హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించటంతో ఇక ఇప్పటి వరకు నమోదు చేయించిన 48 భూ ఆక్రమణ కేసులకు సంబంధించి బడా బాబులను విచారించేందుకు హైడ్రా సిద్దమైంది.
చెరువులు, కుంటల కబ్జాలతో పాటు రహదారులకు అడ్డంగా గోడలను నిర్మించి, ఒక వర్గం ప్రజలను రకరకాలుగా వేధింపులకు గురి చేసిన బడా బాబులను త్వరలోనే నాంపల్లి క్రిమినల్ కోర్టుల భవనంలో హైడ్రాకు కేటాయించిన ప్రత్యేక కోర్టులో హాజరు పరిచేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేస్తుంది. సర్కారు ఆస్తులను కబ్జా చేసినందుకు బడా బాబుల ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయస్థానాన్ని కోరేందుకు హైడ్రా సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయస్థానంలో వాదనలు బలంగా విన్పించి, ఆస్తులను అటాచ్ చేయాలని కోరనున్నట్లు, లేని పక్షంలో కనీసం ఆస్తులను సీజ్ చేయాలని కోర్టును కోరేందుకు హైడ్రా సిద్దమవుతుంది.
Also Read: Allu Aravind: ‘ఆపరేషన్ సింధూర్’.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం!
ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల్లో బడా బాబులెవ్వర్ని ఉపేక్షించేది లేదని నిర్ణయించిన హైడ్రా బాధ్యుల్లో ఎవరైనా పేదలుంటే, వారు నిజంగానే పేదలేనా? అన్న కోణంలో విచారణ జరిపి, నిర్థారణ అయితే వారి పట్ల కాస్త మానవీయంగా వ్యవహారించాలని కూడా హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హైడ్రా నమోదు చేయించిన 48 కేసుల్లో అత్యధికంగా పలువురు బడా బాబులే నిందితులుగా ఉన్నట్లు సమాచారం. వీరందరికీ త్వరలోనే హైడ్రా బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
11 నెలల్లో 450 ఎకరాల స్థలం పరిరక్షణ
గత సంవత్సరం జూలై మాసంలో హైడ్రా ఏర్పడిన నాటి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించే నాటికి హైడ్రా గడిచిన కేవలం 11 నెలల్లోనే సుమారు 450 ఎకరాల స్థలానికి కబ్జా నుంచి విముక్తి కల్గించింది. హైడ్రా పోలీస్ స్టేషన్ కు అదనపు మ్యాన్ పవర్, వాహానాలను కేటాయించటంతో ఇకపై కబ్జాల నివారణ, నియంత్రణ, నిర్మూలన దిశగా హైడ్రా యాక్షన్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు హైడ్రా నమోదు చేయించిన 48 కేసులకు సంబంధించి ఫిర్యాదు దశలోనే ఫిర్యాదులో నిజమెంత అన్న కోణంలో క్షేత్ర స్థాయిలో విచారించి, కబ్జా అయిన విషయాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఆక్రమణలను నేలమట్టం చేసిన సంగతి తెల్సిందే. కానీ చాలా మంది ఆక్రమణదారులు అప్పట్లో హైడ్రా అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తుందని వాదించారు. కానీ ఎంతో ముందు చూపుతో ఫిర్యాదు స్వీకరించిన తర్వాత కూల్చివేతలకు ముందే హైడ్రా కబ్జాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి, కోర్టుకు సమర్పించేందుకు సిద్దం చేసినట్లు సమాచారం.
Also Read: Bhatti Vikramarka: విద్యా, వైద్యానికి సర్కార్ పెద్దపీట.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!