Govt land: ఎంతో విలువైన క్రీడా ప్రాంగణం స్థలం కబ్జాకు గురైంది. స్థానికులు రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గిరిజన యువకులంతా స్వచ్చందంగా ముందుకు కదిలారు. అంతా ఏకమై.. అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. యువకులు చేసిన పనికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అధికారులకు మాత్రం యువత చేసిన పని కంటగింపుగా మారింది. మరోపక్క కబ్జా చేసిన వ్యక్తి యువకులపై ఉల్టా కేసు పెట్టాడు. యువకులు చేసిన పనికి అధికారులు మద్దతు తెలపడం అటుంచితే..ఒక వర్గానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అధికారులకు షాక్ ఇచ్చిన యువకులు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మండలంలోని రెవెన్యూ అధికారులకు గిరిజన యువకులు షాక్ ఇచ్చారు. దుండిగల్ తండా-2లో గత ప్రభుత్వం యువత కోసం కేటాయించిన క్రీడా ప్రాంగణం కబ్జాకు గురైందంటూ పలు మార్లు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ వచ్చిన రెవిన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా..అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
కళ్లెదుట అక్రమ నిర్మాణాల తంతు యథేచ్చగా సాగుతుండడంతో ఉడికిపోయిన దుండిగల్ తండా యువకులు ఏకమయ్యారు. ఆక్రమణలను కూల్చి వేశారు. తండా యువకుల చైతన్యాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. అంతటా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే..అక్రమ నిర్మాణాలకే ఆస్కారం అనేది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు చేయలేని పనిని యువకులు చేసి చూపించారంటూ అభినందిస్తున్నారు.
యువకులపై ఆక్రమణ దారుడి ఫిర్యాదు
ఇంతవరకు బాగానే ఉంది. కానీ..రివర్స్‌గా యువకులపైనే ఆక్రమణ దారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తండాలోని సర్వే నంబర్ 684లో ఈ అక్రమ తంతు సాగుతోంది. కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన స్థానిక నాయకుడు ఒకరు క్రీడా ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపడుతున్నాడు. పాత ఇంటి నెంబర్ల ఆధారంగా చేపడుతున్నానని చెబుతూ ఏవేవో కొన్ని ఇంటి నంబర్లను చూపిస్తూ తనకున్న పలుకుబడితో నిర్విఘ్నంగా పనులు చేపడుతున్నారు.
అయితే స్థానిక గిరిజన యువకులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో వారిపై ఆక్రమణ దారుడు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు యువకులు జరిగిన విషయాన్ని కూలంకుషంగా వివరించారు. గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తే..అధికారులకు చెప్పామని, వారు పట్టించుకోకపోతే ఆక్రమణలను తొలగించామని యువకులు వివరణ ఇచ్చుకున్నారు.
Also Read: Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ..ఫేజ్-2 డీటీఏపీలు ఆమోదానికి సిద్ధం!
అయితే స్థలం కబ్జా చేసిన వ్యక్తిని వదలిపెట్టి పోలీసులు యువకులను విచారించడం పట్ల సర్వతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రెవిన్యూ అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో! అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆక్రమణదారుడిపై చర్యలకు ఉపక్రమిస్తారా? లేక తూతూ మంత్రంగా విచారణ చేపట్టి మమ అన్పిస్తారా!. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. యువకులపై కేసులు పెడతామని బెదిరింపులు వస్తున్నాయని, తమపై కేసులు నమోదు చేస్తే జిల్లా కలెక్టర్, సైబరాబాద్ సీపీ వద్దకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని యువకులు ఖరాఖండిగా చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు