Hyderabad Metro: కొత్త సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు ప్రకటించిన మెట్రో రైలు ఫేజ్-2 డీటైల్ ప్రాజెక్టు రిపోర్టులు సిద్దమయ్యాయని, వాటిని త్వరలోనే హెచ్ఏఎంఎల్ బోర్డు సమావేశంలో వాటిని పరిశీలించి,ఆమోద ముద్ర వేయనున్నట్లు c తెలిపారు. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఫస్ట్ టైమ్ సిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మెట్రోతో పాటు జీహెచ్ఎంసీ జీవీకే వద్ద ఏర్పాటు చేసిన ఫుటోవర్ బ్రిడ్జితో పాటు జలమండలి ఆధ్వర్యంలో అంబర్ పేటలో ఏర్పాటు చేసిన ఎస్టీపీని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలు ఫేజ్-2లో భాగంగా జేబీఎస్ – మేడ్చల్ (24.5 కి.మీ), జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్ లతో పాటు శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ కొత్త కారిడార్(40 కి.మీ) కి కూడా డీపీఆర్ లు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు.
మెట్రో ఎండీ తో ఈ డీపీఆర్ ల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాతనగరం మెట్రో మార్గాన్ని పరిశీలించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి ముప్పు లేకుండా ఏర్పాటు చేసిన అలైన్ మెంట్ ను అభినందించారు. పర్యటనలో మున్సిపల్ శాఖ కార్యదర్శి కె. ఇల్లంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్. వి. కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి, ఇతర మున్సిపల్, మెట్రో, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జీవీకే మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుటోవర్ బ్రిడ్జిని, మూసారాంబాగ్ పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులతో పాటు అంబర్ పేటలోని ఎస్టీపీని సీఎస్ పరిశీలించారు. వచ్చే వర్షాకాలం లోపు బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయటంతో పాటు అభివృద్ది పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
పాత నగరంలోని మెట్రో రైల్ మార్గంలో త్వరితగతిన జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. గత దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన పాతనగర మెట్రో రైలు మార్గంలో ఇప్పుడు జరుగుతున్న పనుల తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల నిడివిగల ఈ మెట్రో కారిడార్ లో ప్రభావిత ఆస్తుల కూల్చివేతలను మెట్రో ఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
దారుల్ షిఫా నుంచి ప్రారంభించి మండీ రోడ్, శాలిబండ జంక్షన్ మార్గంలో ప్రభావిత కట్టడాల కూల్చివేత పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిశితంగా పరిశీలించారు. ఈ మార్గంలో ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగిస్తూ పనులు సాగిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కి వివరించారు. ఈ మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ఇరుకైన రహదారులు ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా కూల్చివేత పనులను చేపట్టామని వివరించారు.
Also Read: Baldia Female Sweepers: ఒక్క సెలవు పెడితే రెండు రోజుల జీతం కట్.. ఇదెక్కడి రూల్?
సమస్యలను చాకచక్యంగా ఎదుర్కొంటూ..
ఈ మార్గం లో దాదాపు 105 మత, చారిత్రక, ఇతర సున్నిత కట్టడాలు ఉన్నాయని,వాటికి ఏమాత్రం హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభావిత కట్టడాల కూల్చివేతలు జరుపు తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీఎస్ కు వివరించారు. పగటి పూట వెనుకభాగంలో ఉన్న కట్టడాలను తొలగించి, రాత్రి సమయాల్లో రహదారికి ఆనుకుని ఉన్న ప్రభావిత ఆస్తులను యంత్రాల సాయంతో తొలగిస్తున్నామని వివరించారు.
ఇందుకు స్థానికులతో ముందుగానే సంప్రదింపులు జరుపుతున్నామని, వారి సహాయ సహకారాలతోనే ముందుకు సాగుతున్నామని ఆయన సీఎస్ కు తెలిపారు. పాతబస్తీలో మెట్రో రైలుకు ఎదురవుతున్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తూ, సమర్థవంతంగా విస్తరణ పనులను నిర్వహిస్తున్నందుకు మెట్రో ఎండీని, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశంసించారు. ప్రభావిత ఆస్తులు దగ్గరదగ్గరగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎస్ సూచించారు.
సురక్షితంగా అక్కడ కూల్చివేతలు, శకలాలు తొలగించే కార్యక్రమం వెంటవెంటనే జరగాలని సీఎస్ ఆదేశించారు. జరుగుతున్న పనుల తీరుతెన్నుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా పనులను మరింత వేగవంతం చేయడానికి అదనపు నిధులను విడుదల చేస్తామని సీఎస్ వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు