TG Rythu Mungitlo: వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే వానా కాలానికి రైతాంగాన్ని పూర్తిగా సంసిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. రైతుల వద్దకు శాస్త్రవేత్తల బృందం వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో 1200 గ్రామాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 6 వారాల పాటు బృందం పర్యటించనుంది. పర్యవేక్షణకు నోడల్ అధికారులను సైతం నియమించారు.
1200 గ్రామాల్లో పర్యటనలు
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల ముగింట్లో శాస్త్రవేత్తలు అనే నూతన కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి జూన్ 13 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 1200 గ్రామాల్లో శాస్త్రవేత్తల బృందం పర్యటించనున్నది. అందుకు సుమారు 200 పైగా శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేశారు.
అవగాహనా కార్యక్రమాలు
దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర తెలంగాణ మండలాల్లో 50 బృందాలు, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు రైతుల వద్దకు వెళ్లనున్నాయి. ఒక్కో బృందం వారి రోజూవారి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు, వారంలోని పని దినాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాల్లోని రైతు వేదికల్లో గానీ మరే ఇతర సౌకర్యవంతమైన ప్రదేశంలో గానీ రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించనున్నారు. యూరియా వాడకం వల్ల కలిగే అనార్ధాలు తగ్గించడంతో ఉపయోగాలు, రసాయనాలను జాగ్రత్తగా వాడడం, చెల్లింపు రశీదులను భద్రపరచడం, సాగు నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచడంపై అవగాహన కల్పించనున్నారు. ఈ అంశాలతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తారు.
వ్యవసాయ శాఖ సహకారంతో..
ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉంటారు. ఇద్దరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థి, వ్యవసాయ శాఖ అధికారి. వీరితో పాటు ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు, సంఘాలు పాల్గొంటాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయంలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్స్, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తాయి. విశ్వవిద్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులతో పాటు వివిధ మండలాల్లోని సహ పరిశోధనా సంచాలకులు, కళాశాలల డీన్లు దీనిని పర్యవేక్షించనున్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమ పర్యవేక్షణకు వ్యవసాయ శాఖ నుంచి నోడల్ అధికారుల నియమించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సైతం ఇవ్వనున్నారు.
Also Read: Caste Census Survey: కులగణన క్రెడిట్ తిప్పలు.. బీజేపీ కొత్త స్కెచ్.. వర్కౌట్ అయ్యేనా!
రైతుల సంక్షేమమే లక్ష్యం
వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. 200 శాస్త్రవేత్తల బృందాలు 1200 గ్రామాల్లో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. రైతులతో బృందాలు ముఖాముఖీ మాట్లాడి సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కారానికి సూచనలు ఇస్తాయని పేర్కొన్నారు. రాబోయే వానాకాలంకు రైతాంగాన్ని సంసిద్ధం చేసేందుకు శాస్త్రవేత్తల బృందం కృషి చేస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని వ్యవసాయ మంత్రి గుర్తుచేశారు.