Sajjanar – Transgenders: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (Sajjanar – Transgenders) హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని వారికి సూచించారు. శుక్రవారం (డిసెంబర్ 12) హైదరాబాద్‌లోని అమీర్ పేటలో ‘సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికారులు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శాంతి భద్రతల సమస్యలు
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, శుభకార్యాల సమయంలో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించబోమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. కేసులు నమోదైతే భవిష్యత్తును నాశనం చేస్తాయని సజ్జనార్ హితబోధ చేశారు. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
Read Also- Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం
ట్రాన్స్‌జెండర్లకు సమగ్ర పాలసీ
ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా సజ్జనార్ గుర్తుచేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా నిలుస్తుందని చెప్పారు.
‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: ఏడీజీ చారు సిన్హా
ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చని ఆమె సూచించారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని అన్నారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని ఆమె సూచించారు.
హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ప్రస్తావించారు . ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పక తీసుకోవాలని సూచించారు . ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also- Ponnam Prabhakar: నూతన సర్పంచ్‌లకు అలర్ట్.. అలా చేస్తేనే నిధులు.. మంత్రి పొన్నం

