Musharraf Farooqui: ఇటీవలి కాలంలో నగరంలో విద్యుత్ ప్రమాదాలు పెరిగాయి. మొన్నటికి మొన్న పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితులు మార్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (SPDCL)) చర్యలు చేపట్టింది. ప్రమాదాలను నివారించడం, ప్రజలకు భద్రత కల్పించడం, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడం, విద్యుత్ అంతరాయాలు తగ్గించడంపై సంస్థ అధికారులు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) వారంలో రెండు రోజులు బస్తీ బాట చేపడుతున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపడుతున్నారు. వారంలో ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ బస్తీ పర్యటన చేపడుతున్నారు. స్వయంగా ఆయనే వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్(Distribution network) పైనా ఫోకస్ పెడుతున్నారు. దీంతో అధికారులు అలర్ట్‌గా ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
ఇళ్లకు దగ్గరగా విద్యుత్ వైర్లు
వాస్తవానికి గతంలో ఏఈ స్థాయి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్‌కు సరిగ్గా వెళ్లే పరిస్థితి లేదు. కానీ స్వయంగా సీఎండీ స్థాయి అధికారి బస్తీ బాట పేరిట ఉదయమే ఫీల్డ్‌లో తిరిగి ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన ఆకస్మిక పర్యటనలు చేస్తుండడంతో ఎప్పుడు ఏ డివిజన్, ఏ సర్కిల్ పరిధిలో వస్తారనే భయంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఈ బస్తీ బాటలో ప్రధానంగా ఇండ్లకు ఆనుకుని విద్యుత్ లైన్లు ఉండడంపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో కూడా ఇదే ప్రధాన సమస్యగా గుర్తించినట్లు తెలిసింది. గల్లీల్లో కేవలం 10 నుంచి 15 ఫీట్ల వరకే రోడ్లు ఉండడంతో ఇరుకు గల్లీల్లో కరెంట్ తీగలు ఇండ్లకు అనుకుని వెళ్తున్నాయి. నగరం పరిధిలో ప్రాథమికంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు దాదాపు 500 కిలోమీటర్ల మేర ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అంతేకాకుండా కొన్ని చోట్ల స్తంభాలను కూడా పిల్లర్లుగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: Ponnam Prabhakar: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అస్తవ్యస్తం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
రూ.10 కోట్ల వరకు ఖర్చు
ఇళ్లకు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో కిలోమీటర్‌కు దాదాపు రూ.2 లక్షల ఖర్చవుతుందని అంచనా వేశారు. దాదాపు 500 కిలోమీటర్ల మేర ఉండడంతో రూ.10 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశమున్నది. ఈ ఓవర్ హెడ్ లైన్ల స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేయనుండడంతో బస్తీల్లో నూతన మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పనులను చేపట్టిన అధికారులు దాదాపు 50 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటుతో ప్రజలకు భద్రతతో పాటు, విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గనున్నాయి. అలాగే అంతరాయాలు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రజల భద్రతే ముఖ్యం
నగరంలో చాలా బస్తీల్లో ఇళ్లకు ఆనుకుని విద్యుత్ తీగలు ఉండడంతో వారికి నిత్యం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే సర్కార్ అంగీకారంతో వాటిని తొలగించి వాటి స్థానంలో ఎయిర్ బంచ్డ్ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేబుళ్లు వేసే సమయంలో దెబ్బతినకుండా శాస్త్రీయ పద్ధతిలో వేయాలని సిబ్బందికి సూచించాం. ఎందుకంటే ఎలా పడితే అలా కేబుల్ లాగడం వల్ల కొత్త కేబుల్ కూడా డ్యామేజీ అయ్యే అవకాశమున్నది. అందుకే దానికి ఆస్కారమివ్వకుండా ఉండేందుకు అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా నిబంధన విధించామని త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని, ముషారఫ్ ఫరూఖీ ఎస్పీడీసీఎల్ సీఎండీ అన్నారు.
Also Read: Telangana Bandh: రేపు బంద్? ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
